Sunday, December 22, 2024

సమరోత్సాహంతో సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

నేడు గుజరాత్‌తో ఢీ
అహ్మదాబాద్ : ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన హైదరాబాద్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముంబైపై సన్‌రైజర్స్ ప్రదర్శన జట్టు ఆటగాళ్లలో కొత్త జోష్‌ను నింపింది. దీంతో గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది.

బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ చాలా బలోపేతంగా మారింది. ముంబైపై ఒక్క మయాంక్ అగర్వాల్ తప్ప మిగతా బ్యాటర్లందరూ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే లక్షంతో హైదరాబాద్ బ్యాటర్లు ఉన్నారు. మయాంక్ అగర్వాల్ కూడా గాడిలో పడితే సన్‌రైజర్స్‌కు ఎదురే ఉండదు. కిందటి మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్‌క్రమ్, క్లాసెన్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక యువ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ 23 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 63 పరుగులు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్, హెడ్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ముంబై బౌలర్లను హడలెత్తించిన క్లాసెన్ 34 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 80 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. క్లాసెన్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ అర్ధ సెంచరీలు సాధించి జోరుమీదున్నాడు. గుజరాత్‌పై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. మార్‌క్రమ్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, కెప్టెన్ కమిన్స్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించేందుకు సిద్ధమైంది. ఇక కమిన్స్, ఉనద్కట్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, షాబాజ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలుపు కోసం టైటాన్స్..

మరోవైపు ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా ఉంది. కానీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు గుజరాత్‌లో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ముంబై వంటి బలమైన జట్టును ఓడించిన గుజరాత్ కిందటి పోరులో మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో చెన్నై చేతిలో పరాజయం చవిచూసింది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News