Sunday, September 8, 2024

సన్‌రైజర్స్‌కు రెండో ఓటమి

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌పై ఏడు వికెట్ల తేడాతో చిత్తు

అహ్మదాబాద్ : సొంత స్టేడియంలో చెలరేగిన సన్‌రైజర్స్ మోడీ స్టేడియంలో తేలిపోయింది. సిక్సర్లతో పరుగుల వరద పారించిన ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు గుజరాత్ బౌలర్లను ఎదుర్కొవడంలో తిప్పలు పడ్డారు. ఐపిఎల్ సిజన్ 17లో భాగంగా గుజరాత్‌లో ఆదివారం మ్యాచ్‌లో సన్ రైజర్స్‌పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది, 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. ఐదు బంతులు మిగిలుండగానే లక్షాన్ని ఛేదించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44) పరుగులతో నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (36) పరుగులతో రాణించగా సాహా (25), విజయ్ శంకర్ (14) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, కమిన్స్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు శుభారంభం లభించలేదు.

మయాంక్ అగర్వాల్ (16) మరోసారి నిరాశపరిచాడు. అజ్మతుల్లా బౌలింగ్‌లో దర్మన్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (19) సయితం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ అభిషేక్ శర్మ (29) దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో సన్‌రైజర్స్ పవర్‌ప్లేలో 56 పరుగులు చేయగలిగింది. రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో అభిషేక్ వరుసగా రెండు సిక్సర్లు సాధించాడు. కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లు పుంజుకున్నారు.

క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ సన్‌రైజర్స్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. అభిషేక్, హెన్రిచ్ క్లాసెన్ (24), ఎయిడెన్ మార్క్మ్ (17) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అబ్దుల్ సమద్‌తో షాబాజ్ అహ్మద్ (22) స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. దీంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక.. గుజరాత్ బౌలింగ్‌లో కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్ పరుగుల వరదకు అడ్డు కట్ట వేయగా అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ సంపాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News