Saturday, April 5, 2025

సన్‌రైజర్స్‌కు పరీక్ష

- Advertisement -
- Advertisement -

నేడు కోల్‌కతాతో కీలక పోరు

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా రెండింటిలో పరాజయం చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగే పోరు సన్‌రైజర్స్‌కు సవాల్‌గా మారింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా తయారైంది. తొలి మ్యాచ్‌లో తప్ప బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. దీని ప్రభావం సన్‌రైజర్స్‌పై బాగానే పడింది. కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నైట్‌రైడర్స్‌కు కూడా మ్యాచ్ కీలకంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతోంది. మూడు మ్యాచుల్లో ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో కోల్‌కతా అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు కీలకంగా మారారు. జట్టుకు శుభారంభం అందించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. ఈ సీజన్‌లో అభిషేక్ ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. మూడు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా తయారైంది. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా అభిషేక్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే జట్టు బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ట్రావిస్ హెడ్ ఫామ్‌లో ఉండడం సన్‌రైజర్స్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అభిషేక్‌తో కలిసి జట్టుకు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించాల్సిన బాధ్యత హెడ్‌పై ఉంది. అతను దీనిలో ఎంత వరకు సఫలమవుతాడో వేచి చూడాల్సిందే.
ఇషాన్ ఈసారైనా..
మరోవైపు తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ తర్వాతి పోటీల్లో ఘోరంగా విఫలమయ్యాడు. రెండో మ్యాచ్‌లో ఖాతా తెరకుండానే పెవిలియన్ చేరాడు. మూడో మ్యాచ్‌లో రెండు పరుగులు మాత్రమే చేశాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపిస్తోంది. జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఇషాన్ వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం ఆందోళన కలిగించే అంశమే. కోల్‌కతాపై అతను మెరుపులు మెరిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా, క్లాసెన్ ఫామ్‌లో ఉండడం సన్‌రైజర్స్ ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. మూడు మ్యాచుల్లోనూ క్లాసెన్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్ కనబరచాలని భావిస్తున్నాడు. యువ సంచలనం అనికేత్ వర్మ జోరుమీదుండడం హైదరాబాద్‌కు సానుకూలంగా మారింది. కిందటి మ్యాచ్‌లో అనికేత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక బౌలింగ్ సమస్య కూడా హైదరాబాద్‌ను వెంటాడుతోంది. షమి, కమిన్స్, ఆడమ్ జంపా, హర్షల్ పటేల్ తదితరులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. అప్పుడే హైదరాబాద్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
సవాల్ వంటిదే..
ఇక ఆతిథ్య కోల్‌కతాకు కూడా ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే నైట్‌రైడర్స్ జయభేరి మోగించింది. ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. అంతకుముందు మొదటి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఇలాంటి స్థితిలో సన్‌రైజర్స్‌తో పోరు జట్టుకు పరీక్షగా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరో ఓటమి ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News