Saturday, November 23, 2024

నేడు ఐపిఎల్ ఫైనల్ సమరం.. ట్రోఫీ కొట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్ సీజన్17 ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా జరిగే తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. లీగ్ దశలో కోల్‌కతా మొదటి, హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్1లో సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది.

కాగా, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో అద్భుత విజయం సాధించిన హైదరాబాద్ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఆదివారం జరిగే తుది పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఫైనల్లో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఆ ఇద్దరే కీలకం..

తుది సమరంలో హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం జట్టును కలవరానికి గురి చేసే అంశంగా చెప్పాలి. కానీ బ్యాట్‌తో విఫలమైనా అభిషేక్ బంతితో సత్తా చాటాడు. ఇది జట్టుకు సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే హెడ్, అభిషేక్‌లు విజృంభిస్తే హైదరాబాద్‌కు కళ్లు చెదిరే ఆరంభం లభించడం ఖాయం.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరడంలో ఓపెనర్లు పాత్ర చాలా కీలక పాత్ర పోషించారు. ఇక ఫైనల్లోనూ వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. హెడ్ రెండు నాకౌట్ మ్యాచుల్లోనూ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అభిషేక్ కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా జట్టుకు భారీ స్కోరు ఖాయం. మరోవైపు రాహుల్ త్రిపాఠి కూడా దూకుడుగా ఆడుతున్నాడు. రెండు మ్యాచుల్లోనూ అతను సత్తా చాటాడు. ఫైనల్లోనూ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్ రూపంలో హైదరాబాద్‌కు విధ్వంసక బ్యాటర్ అందుబాటులో ఉన్నాడు.

ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా క్లాసెన్ సొంతం. కీలకమైన ఫైనల్లో క్లాసెన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ప్లేఆఫ్‌లో హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ క్లాసెన్ జట్టుకు అండగా నిలిచాడు. ఫైనల్లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. నితీష్ రెడ్డి, మార్‌క్రమ్, సమద్, షాబాజ్, కెప్టెన్ కమిన్స్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక భువనేశ్వర్ కుమార్, నటరాజన్, షాబాజ్, అభిషేక్‌లతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో షాబాజ్, అభిషేక్‌లు తమ స్పిన్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

జోరుమీదున్న నైట్‌రైజర్స్..

మరోవైపు ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన కోల్‌కతా తొలి క్వాలిఫయర్‌లోనూ సత్తా చాటింది. హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అలవోక విజయాన్ని అందుకుంది. ఇక సన్‌రైజర్స్‌తో జరిగే ఫైనల్ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో కోల్‌కతా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.

గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. సునీల్ నరైన్, వెంకటేష్‌లు ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాట్‌తో బంతితో నరైన్ చెలరేగిపోతున్నాడు. కీలకమైన ఫైనల్లో కూడా జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. స్టార్, నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రస్సెల్ తదితరులతో జట్టు బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో తుది పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News