నేడు ముంబైతో కీలక పోరు
ముంబై: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లు తమతమ ఆఖరి మ్యా చ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావడం హైదరాబాద్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇక ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబై అద్భుత విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ వరుస విజయాలకు బ్రేక్ వేసింది. ఢిల్లీపై విజయం ముంబై ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
అందరి కళ్లు అభిషేక్‌పైనే..
ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మపైనే నిలిచాయి. పంజాబ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసక శతకం సాధించాడు. ముంబైపై కూడా ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. పంజాబ్‌పై అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి పెను ప్రకంపనలు సృష్టించాడు. అభిషేక్ విధ్వంసక శతకంతో హైదరాబాద్ 246 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. సహచర ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి మరో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలనే లక్షంతో అభిషేక్ ఉన్నాడు. ఇద్దరు మరోసారి చెలరేగితే ఈ మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్‌కు భారీ స్కోరు ఖాయమనే చెప్పాలి. ఇషాన్ కిషన్ కూడా తన బ్యాట్‌కు పనిచెబితే హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు అభిషేక్, హెడ్‌లతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ శర్మ, కెప్టెన్ కమిన్స్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ భారీ స్కోరు చేయడం ఖాయమనే చెప్పాలి.
బౌలింగే అసలు సమస్య..
బ్యాటింగ్‌లో బాగానే ఉన్నా బౌలింగ్ సమస్య హైదరాబాద్‌ను వెంటాడుతోంది. షమి, కమిన్స్, హర్షల్ పటే ల్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్నా ఫలితం లేకుండా పో తోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ ఒక్కడే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశాడు. హర్షల్ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అయితే సీనియర్ బౌలర్ ఈ సీజన్‌లో పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో షమి 4 ఓవర్లలో ఏకం గా 75 పరుగులు సమర్పించుకున్నాడు. దీన్ని బట్టి అతని బౌలింగ్ ఎంత పేలవంగా సాగుతుందో ఊహించుకోవచ్చు. ఈ మ్యాచ్‌లోనైనా షమితో పాటు ఇతర బౌలర్లు మెరుగైన బౌలింగ్‌ను కనబరచక తప్పదు. అ ప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.
ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో పటిష్టమైన ఢిల్లీని ఓడించిన ముంబై జోరుమీదుంది. హైదరాబాద్‌పై కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రికెల్టన్, రోహిత్, సూర్యకుమార్, తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్య, విల్ జాక్స్, నమన్‌ధిర్ తదితరులతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, దీపక్ చాహర్, సాంట్నర్, హార్దిక్, కర్ణ్ శర్మ, బౌల్ట్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్ జట్టులో ఉన్నారు. దీంతో ముంబై కూడా విజయంపై కన్నేసింది.