Sunday, April 13, 2025

సన్‌రైజర్స్ రాత మారేనా?

- Advertisement -
- Advertisement -

నేడు పంజాబ్‌తో కీలక సమరం

మన తెలంగాణ/ హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో కిందటి రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరు హైదరాబాద్‌కు చావోరేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన స్థితి జట్టుకు ఏర్పడింది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ నాలుగింటిలో పరాజయం పాలైంది. దీంతో జట్టు ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. నాకౌట్ రేసులో నిలువాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలన్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. బ్యాటింగ్ వైఫ్యం హైదరాబాద్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. కిందటి సీజన్‌లో బ్యాటింగ్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. బ్యాటింగ్ వైఫల్యంతో జట్టుకు వరుస ఓటములు తప్పడం లేదు. ఇలాంటి స్థితిలో బలమైన పంజాబ్‌తో పోరు సవాల్‌గా మారింది.
బ్యాటింగ్ గాడిలో పడాల్సిందే..
వరుస ఓటములతో డీలా పడిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతోంది. ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించక తప్పదు. ఇలాంటి స్థితిలో పంజాబ్‌తో జరిగే పోరులో బ్యాటర్లు రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు జట్టుకు శుభారంభం అందించలేక పోతున్నారు. కిందటి సీజన్‌లో అభిషేక్, హెడ్‌లు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ఈసారి మాత్రం అలాంటి జోరును కనబరచలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా వీరు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సి ఉంది. వీరు మెరుగైన ఆరంభాన్ని అందిస్తేనే జట్టుకు భారీ స్కోరు దక్కే ఛాన్స్ ఉంటుంది. ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్ తదితరులు కూడా మెరుపులు మెరిపించక తప్పదు. బ్యాటర్లు సమష్టిగా రాణిస్తేనే హైదరాబాద్‌కు భారీ సాధ్యమవుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటర్లు తేలిపోతే జట్టుకు మరో ఓటమి ఖాయం.

 

గెలుపు కోసం..

మరోవైపు పంజాబ్ ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు మ్యాచుల్లో విజయం సాధించి జోరుమీదుంది. హైదరాబాద్‌పై కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగ ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. కిందటి మ్యాచ్‌లోయువ సంచలనం ప్రియాంశ్ ఆర్య విధ్వంసక సెంచరీ సాధించడం జట్టుకు అతిపెద్ద ఊరటగా చెప్పాలి. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా దూకుడుమీదున్నాడు. శ్రేయస్, నెహాల్ వధెరా, మాక్స్‌వెల్, స్టోయినిస్, శశాంక్ సింగ్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్, జాన్సన్‌లతో కూడా కూడా పటిష్టంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News