Friday, November 22, 2024

హైదరాబాద్‌కు ఎదురుందా?

- Advertisement -
- Advertisement -

నేడు ఉప్పల్‌లో బెంగళూరుతో పోరు

మన తెలంగాణ/ హైదరాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ తన చివరి నాలుగు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

సొంత గడ్డపై జరుగుతున్న పోరులో హైదరాబాద్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అంతేగాక బెంగళూరును వారి సొంత మైదానంలో ఓడించడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించేందుకు తహతహలాడుతోంది. ఇక బెంగళూరు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా ఒక్కదాంట్లో మాత్రం విజయం సాధించింది. వరుస ఓటములతో బెంగళూరు ఇప్పటికే నాకౌట్ రేసుకు దూరమైంది. ప్లేఆఫ్ అవకాశాలకు దాదాపు తెరపడడంతో మిగిలిన మ్యాచుల్లోనైనా మెరుగైన ప్రదర్శనతో కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే పటిష్టమైన హైదరాబాద్‌తో పోరు బెంగళూరుకు సవాల్‌గా తయారైంది.

జోరుమీదున్న సన్‌రైజర్స్..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత నిలకడైన ఆటతో అలరిస్తోంది. బ్యాటింగ్‌లో హైదరాబాద్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. రెండు సార్లు ఐపిఎల్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 287 పరుగులు సాధించి ఐపిఎల్‌లో నయా చరిత్ర లిఖించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. ఇద్దరు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

అంతేగాక హెన్రియ్ క్లాసెన్, ఐడెన్ మార్‌క్రమ్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి తదితరులు కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. ఇతర జట్లతో పోల్చితే హైదరాబాద్ చాలా బలంగా ఉందని చెప్పాలి. ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్‌లోని ఇతర బ్యాటర్లు అసాధారణ రీతిలో చెలరేగి పోతుండడంతో సన్‌రైజర్స్ వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్‌కు మరింత చేరువ కావాలని భావిస్తోంది. ఓపెనర్లు హెడ్, అభిషేక్‌లు ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారారు. వీరిద్దరూ మరోసారి శుభారంభం అందిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక క్లాసెన్, మార్‌క్రమ్, సమద్, షాబాజ్, నితీష్‌లు కూడా బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. బౌలింగ్‌లో కూడా సన్‌రైజర్స్ బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

సవాల్ వంటిదే..

మరోవైపు బెంగళూరుకు ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. ఇప్పటి వరకు 8 మ్యాచుల్లో బెంగళూరుకు ఏడింటిలో పరాజయాలు ఎదురయ్యాయి. ఇక కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో బెంగళూరు చివరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కాగా, ఏడు మ్యాచుల్లో ఓటమి పాలైన ఛాలెంజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది.

వరుస ఓటముల నేపథ్యంలో ప్లేఆఫ్ అవకాశాలకు దాదాపు తెరపడిందనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టి వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా తయారైంది. విరాట్ కోహ్లి ఆరంభ మ్యాచుల్లో బాగానే ఆడినా ఇప్పుడు వరుసగా విఫలమవుతున్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడు. ఇతర ఆటగాళ్లు కూడా పేలవమైన ఫామ్‌లో ఉండడంతో బెంగళూరుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి స్థితిలో బలమైన హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలా ఆడుతుంతో చెప్పలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News