సమరోత్సాహంతో రాజస్థాన్
గెలుపే లక్షంగా హైదరాబాద్
నేడు క్వాలిఫయర్2 సమరం
చెన్నై: ఐపిఎల్ సీజన్17 ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు చేరుకుంది. రెండో బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. కోల్‌కతాతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ ఘోర పరాజయం చవిచూసింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ అద్భుత విజయం సాధించింది. దీంతో శుక్రవారం చెన్నై వేదికగా జరిగే రెండో క్వాలిఫయర్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. లీగ్ దశలో రాజస్థాన్ మూడో స్థానంలో నిలువగా, హైదరాబాద్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అంతేగాక హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. ఇక తాజాగా చిదంబరం స్టేడియంలో జరిగే నాకౌట్ పోరులో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్ ఉంది. అయితే తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం పాలు కావడంతో సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. ఇలాంటి స్థితిలో బలమైన రాజస్థాన్‌తో పోరు సవాల్ వంటిదే నని చెప్పాలి.
ఓపెనర్లే కీలకం..
మరోవైపు ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కీలకంగా మారారు. ఈ సీజన్‌లో ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నాకౌట్‌కు చేరడంలో వీరిద్దరి పాత్ర చాలా కీలకమనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తొలి క్వాలిఫయర్‌లో ఇద్దరు తమ స్థాయకి తగ్గ ప్రదర్శన చేయలేక పోయారు. హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అభిషేక్ మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఈ పరిస్థితుల్లో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరూ తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరంఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా హైదరాబాద్‌కు భారీ స్కోరు ఖాయం. ఇక రాహుల్ త్రిపాఠి ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో త్రిపాఠి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా కోల్‌కతా మ్యాచ్‌లో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే షాబాజ్ అహ్మద్, సమద్, నితీష్ రెడ్డి, సన్విర్ సింగ్ తదితరులు విఫలం కావడం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈసారైనా వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. అప్పుడే హైదరాబాద్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
పరీక్షలాంటిదే..
మరోవైపు రాజస్థాన్‌కు కూడా ఈ మ్యాచ్ పరీక్షలాంటిదేనని చెప్పాలి. లీగ్ దశలో చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లో జట్టు వరుస ఓటములు చవిచూసింది. ఇది జట్టుపై ఒత్తిడి తెచ్చే అంశమే. అంతేగాక జట్టులో కీలక ఆటగాడైన జోస్ బట్లర్ దూరం కావడం కూడా జట్టుకు ప్రతికూల అంశమే. ఇలాంటి స్థితిలో జట్టు సారథి సంజూ శాంసన్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్ తదితరులు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పక తప్పదు. అప్పుడే జట్టుకు భారీ స్కోరు సాధ్యమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న రాజస్థాన్ సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో పటిష్టమైన బెంగళూరును ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే జోరును సన్‌రైజర్స్‌పై కూడా కొనసాగించి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో రాజస్థాన్ ఉంది. ఇందులో ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.