హైదరాబాద్ చేతిలో ఆర్‌సిబి చిత్తు
ముంబై: ఐపిఎల్ సీజన్15లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఐదో విజయం అందుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్లతో తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 8 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కళ్లు చెదిరే శుభారంభం అందించాడు. ధాటిగా ఆడిన అభిషేక్ 28 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ 17 (నాటౌట్), రాహుల్ త్రిపాఠి 7 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకొంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సఫఫలమయ్యారు.
మార్కొ జాన్సెన్ అద్భుత బౌలింగ్‌తో బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. అతని ధాటికి ఓపెనర్లు డుప్లెసిస్ (5), అనూజ్ రావత్ (0)లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి (0) పెవిలియన్ చేరారు. మాక్స్‌వెల్ (12), ప్రభుదేశాయ్ (15) తప్ప మిగతావారు రెండంకెల స్కోరును అందుకోలేక పోయారు. హైదరాబాద్ బౌలర్లలో జాన్సెన్, నటరాజన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. సుచిత్‌కి రెండు వికెట్లు దక్కాయి. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం.