Tuesday, March 25, 2025

శతక్కొట్టిన ఇషాన్

- Advertisement -
- Advertisement -

హెడ్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు
తొలిపోరులో ఆర్‌ఆర్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం

మన తెలంగాణ/ ఉప్పల్: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో గెలుపొంది శుభారంభం చేసింది. ఇషాన్ కిషన్108 (47 బంతులు: 11×4, 6×6), ట్రావిస్ హెడ్ 67 (31 బంతులు: 9×4, 3×6), హెన్రిచ్ క్లాసెన్ 34 (14 బంతులు: 5×4, 1×6), అభిషేక్ శర్మ(24) బ్యాటింగ్ ధాటికి ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇషాన్ సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్, క్లాసెల్ అర్థ శతకాలతో రాణించారు. ఫోర్లు, సిక్సర్లతో దంచికొడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అనంతరం లక్ష ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు 242 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ తొలి ఓటమిని మూటగట్టుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సాధించిన 286 పరుగుల స్కోరు ఐపిఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు.
సన్‌రైజర్స్‌కు శుభారంభం..
అంతకుముందు టాస్ బ్యాటింగ్‌కు దిగిన సైన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ శుభారంభాన్ని ఇచ్చారు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని మహీష్ తీక్షణ విడగొట్టాడు. అద్భుత బంతితో అభిషేక్ శర్మ (24)ను ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకివచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి ట్రావిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంరతం కొద్గిసేపు క్రీజులో కొనసాగిన హెడ్ తుషార్‌దేశ్ పాండే బౌలింగ్‌లో హెట్ మేయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో వీరి 85 పరుగుల భాగస్వామ్యానికితెరపడింది. అంతేకాదు తొలి పవర్ ప్లేలోనే 90 పరుగులు సాధించి నయా రికార్డును నమాదు చేసింది సన్‌రైజర్స్.
ఇషాన్ కిషన్ సెంచరీ..
అనంతరం క్రీజులోకివచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి(30)తో కలిసి ఇషాన్ కిషన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వరుసగా బౌండరీలు కొడుతూ అభిమానులను హోరెత్తించాడు. ఈ క్రమంలో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తరువాత మరింత రెచ్చిపోయి ఆడాడు. అతనికితోడుగా నితీష్ కుమార్ రెడ్డి సయితం చెలరేగడంతో జట్టు స్కోరు 15 ఓవర్లకే 200 దాటింది. జోరుమీదున్న నితీష్ కుమార్.. మహీష తీక్షణ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోపక్కా ఇషాన్ కిషాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా మరింత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరలో హెన్రిచ్ క్లాసెన్ (34 ) వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ స్కోరు 286 పరుగులకు చేరింది.
దీటుగా జవాబిచ్చిన రాజస్థాన్..
అనంతరం రాజస్థాన్ రాయల్స్.. తొలుత తడబడినా తేరుకొని ధీటుగానే జవాబు ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓటమిపాలైంది. సంజూ శాంసన్ 66 (37 బంతులు: 7×4, 4×6), ధ్రువ్ జురెల్ 70 (35 బంతులు: 5×4, 6×6) హాఫ్ సెంచరీలతో చెలరేగినా.. చివరలో సిమ్రాన్ హెట్మేయర్(42), శుభమ్ దూబే(34 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News