రామచంద్రకట్టపైకి వేంచేసిన శ్రీ గోవిందరాజస్వామి జనవరి 6 నుండి 12వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు
తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 6 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ గోవిందరాజస్వామివారు రామచంద్రకట్టపైకి వేంచేపు చేశారు. ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వామివారు ముందుగా ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది.
జనవరి 6 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపడతారు. ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.