కడప: పురాతన ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి జెఈవో వీరబ్రహ్మం వెల్లడించారు. ఒంటిమిట్టలోని రాములవారి ఆలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పనులను సోమవారం సివిఎస్వో గోపినాథ్ జెట్టి, జిల్లా ప్రభుత్వ, పోలీస్ అధికారులతో కలిసి జెఈవో పరిశీలించారు. మెరుగైన ఏర్పాట్ల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి కల్యాణవేదిక వద్ద జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15వ తేదీన శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు మెరుగైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రివర్యులు విచ్చేయనుండడంతో జిల్లా యంత్రాంగంతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కల్యాణవేదిక వద్ద లక్ష మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా షెల్టర్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక మరుగుదొడ్లు, మొబైల్ మరుగుదొడ్లు, నీటి వసతి, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సివిఎస్వో మాట్లాడుతూ.. టిటిడి విజిలెన్స్ సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక వద్ద సిసి టివిలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారీకేడ్లు, ట్రాఫిక్ మల్లింపు, కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.
Sri Kodanda Rama Swamy Brahmotsavam from April 10