Thursday, January 23, 2025

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు.

ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నరేష్ బాబు, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు నవీన్, ఆల‌య అర్చ‌కులు, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News