Monday, November 18, 2024

శ్రీలంక ఆరాటం!

- Advertisement -
- Advertisement -

మన పొరుగునే గల ద్వీప దేశం శ్రీలంక వున్నట్టుండి ఏడు దేశాల విహార యాత్రికులకు ఉచిత వీసాలు ఇవ్వాలని తీసుకొన్న నిర్ణయం అది ఎదుర్కొంటున్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల్లో సమంజసమైనదే. చిరకాలంగా తాను అనుభవిస్తున్న గడ్డు స్థితి నుంచి గట్టెక్కడానికే అది ఈ నిర్ణయం తీసుకొన్నది. సోమవారం నాడు శ్రీలంక మంత్రి వర్గం ఆమోదించిన ఈ ఏర్పాటు వెంటనే అమల్లోకి వచ్చింది. చైనా, ఇండియా, రష్యా, జపాన్, థాయిలాండ్, ఇండోనేసియా, మలేసియాల నుంచి వెళ్లే టూరిస్టులకు ఉచిత వీసాలు ఇవ్వాలన్న ఈ నిర్ణయం 2024 మార్చి వరకు అమల్లో వుంటుంది. అంటే ఈ ఏడు దేశాల టూరిస్టులు కేవలం పాస్‌పోర్టు వుంటే చాలు శ్రీలంకకు ఉచిత వీసా పొందుతారు.

ఆశించిన ఆర్థిక ప్రయోజనం కలిగితే శ్రీలంక వచ్చే మార్చి తర్వాత కూడా దీనిని కొనసాగించే అవకాశం వుండొచ్చు. ఇప్పటికే నేపాల్, భూటాన్, కతార్, ఒమన్ వంటి కొన్ని దేశాలు వెళ్లడానికి పాస్‌పోర్టు కలిగిన భారతీయులకు వీసా అవసరం లేదు. ఇప్పుడు శ్రీలంక ఆ జాబితాలో చేరింది. సుందరమైన బీచ్‌లు, ప్రాచీన ఆలయాలు వంటి విశేష ఆకర్షణలు గల శ్రీలంకలో తేనీరు (టీ) కూడా ఆహ్లాదకరంగా వుంటుంది. దాని స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో టూరిజం వాటా 12.6 శాతం. 2000లలో జిడిపిలో 6 శాతంగా వున్న ఆ ఆదాయం త్వరత్వరగా పెరిగి 2019కి 12.6 శాతానికి చేరింది. అయితే ఆ ఏడాది ఏప్రిల్ 21న శ్రీలంక బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది.

క్రైస్తవులకు పవిత్రమైన ఈస్టర్ రోజున మూడు చర్చీలపైన, కొలంబోలోని మూడు విలాసవంతమైన హోటళ్ళపైన జరిగిన ఈ దాడుల్లో 300 మంది దుర్మరణం పాలయ్యారు. అప్పటి నుంచి తగ్గుముఖం పట్టిన టూరిజం ఆ తర్వాత దాపురించిన కోవిడ్19 కాలంలో మరింతగా దెబ్బతిన్నది. ఈ ఏడాది తిరిగి పుంజుకొంటున్నప్పటికీ 2019 బాంబు దాడులకు ముందున్న స్థాయి ఆదాయం ఇంకా లభించడం లేదు. 2018లో 23 లక్షల మంది టూరిస్టులు శ్రీలంకను సందర్శించారు. 4.4 బిలియన్ డాలర్ల ఆదాయం దానికి లభించింది. ఈ ఏడాది ఆగస్టు వరకు టూరిజం మీద శ్రీలంకకు లభించిన రాబడి 1.3 బిలియన్ డాలర్లే. అయితే గత ఏడాది వచ్చిన 833 మిలియన్ డాలర్ల కంటే ఇది చాలా ఎక్కువ. కేవలం 2 కోట్ల 20 లక్షల మంది జనాభా కలిగిన శ్రీలంకకు తలనొప్పులు మాత్రం అసంఖ్యాకం.

మెజారిటీ జనాభాగా వున్న సంహళీయుల జాత్యహంకారం వల్ల అది చాలా నష్టపోయింది. శ్రీలంక ఉత్తర తూర్పు రాష్ట్రాల్లోని తమిళ ప్రాంతాలు చాలా కాలం పాటు ఈలం తిరుగుబాటుతో ఉడికిపోయాయి. దానిని అణచివేసిన క్రమంలో అక్కడి పాలకులు తమిళుల హక్కులను కాలరాశారు. వ్యవసాయంలో సేంద్రియ సాగును ప్రోత్సహించి ప్రపంచ ప్రప్రథమ సేంద్రియ పంటల దేశంగా ప్రసిద్ధికెక్కాలనే తాపత్రయంతో శ్రీలంక పాలకులు తీసుకొన్న విధాన నిర్ణయం ఆ రంగంలో దాని స్వయం సమృద్ధిని దెబ్బ తీసింది. డాలరు ఆదాయం తగ్గిపోడంతో బయటి నుంచి విచ్చలవిడిగా తీసుకొన్న అప్పులను తీర్చలేక ఆర్థికంగా దివాలా స్థితికి చేరుకొన్నది. స్థానిక కరెన్సీని సామర్థానికి మించి ఇబ్బడిముబ్బడిగా ముద్రించడంతో ద్రవ్యోల్బణం మిన్నంటింది. బయటి నుంచి తెచ్చుకొనే ఇంధనం తదితరాలకు విదేశీ మారకం చాలకపోడంతో దేశంలో పెట్రోల్ కొరత, ధరలు తీవ్ర స్థాయికి చేరుకొన్నాయి.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఎంతగా వేడుకొన్నా అది సకాలంలో అప్పు ఇవ్వకుండా ఏడిపించింది. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలు చెప్పనలవికాని స్థాయికి చేరుకొని దేశాధ్యక్షుని భవనాన్నే ముట్టడించే పరిణామానికి దారి తీశాయి. శ్రీలంకలో పన్నులు జిడిపితో పోల్చుకొంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత తక్కువగా వున్నాయని ప్రపంచ బ్యాంకు వ్యాఖ్యానించింది. అంటే అసలే అత్యధిక జీవన వ్యయంతో అష్టకష్టాల పాలవుతున్న ప్రజల మీద అధిక పన్నుల గదలతో మరింతగా మోదాలని సూచిస్తున్నదన్న మాట. దానినే అది ఆర్థిక సంస్కరణలనే ముద్దు పేరుతో పిలుస్తుంది. ఐఎంఎఫ్ షరతులను అమలు చేయడమంటే సాధారణ ప్రజానీకాన్ని మరింతగా పీడించడమే అన్నది అనేక దేశాల్లో రుజువైంది. అలవికాని అప్పుల నుంచి వీలైనంత తొందరగా బయటపడాలన్న తాపత్రయం టూరిస్టులకు గేట్లు బాగా తెరవాలన్న శ్రీలంక సంకల్పంలో కనిపిస్తున్నది.

అయితే ఇది ఎంత వరకు ఫలిస్తుందో ఆచరణలో గాని తెలియదు. టూరిస్టులు రావడమే కాదు, విశేషంగా ఖర్చు పెట్టగల ధనిక టూరిస్టుల ప్రవాహం పెరిగితేనే శ్రీలంక ఆశిస్తున్న మంచి దానికి జరుగుతుంది. కేవలం టూరిజం ఒక్క దాని మీదనే కాకుండా ఇతర రంగాల అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టవలసి వుంది. కూరుకుపోయిన ఊబిలోంచి బయట పడాలన్న శ్రీలంక ఆరాటాన్ని ప్రోత్సహించి తీరవలసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News