Friday, November 22, 2024

చివరి టెస్టులో లంక ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి టెస్టులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఇంగ్లండ్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక కెన్నింగ్టన్ ఓవల్ (లండన్)లో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక అసాధారణ ఆటను కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన లంక చారిత్రక విజయాన్ని అందుకుంది. 219 పరుగుల లక్ష్యాన్ని లంక 40.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా అజేయ శతకంతో లంకకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నిసాంకా కళ్లు చెదిరే శతకం సాధించాడు.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నిసాంకా 124 బంతుల్లోనే 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని కుశాల్ మెండిస్ (39), ఎంజిలో మాథ్యూస్ 32 (నాటౌట్) సహకారం అందించారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో కూడా నిసాంకా మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లోనే 64 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325, రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. కాగా, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో లంక బౌలర్లు లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో సత్తా చాటారు. లహిరు నాలుగు, విశ్వ మూడు, అసిత రెండు వికెట్లను పడగొట్టారు. నిసాంకాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News