డెర్బీ: ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను శ్రీలంక మహిళా క్రికెట్ టీమ్ 21తో సొంతం చేసుకుంది. మూడో, చివరి టి20లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో శ్రీలంక సిరీస్‌ను దక్కించుకుంది. ఇంగ్లండ్‌పై శ్రీలంక మహిళలకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 116 పరుగులు చేసి ఆలౌటైంది.
తర్వాత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 17 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌గా దిగిన చామన్ ఆటపట్టు విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఆటపట్టు 28 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ అనూష్క (20)తో కలిసి తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్షిత 26 (నాటౌట్) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో లంక చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ మాయా బౌచిర్ (23), వికెట్ కీపర్ ఆమీ జోన్స్ (20), కెప్టెన్ నైట్ (18), గిబ్సన్ (21), సారా గ్లెన్ (16) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. లంక బౌలర్లలో ఆటపట్టు మూడు, ప్రబోధని కవిశా దిల్హారి రెండు వికెట్లు పడగొట్టారు.