గెలుపు బాటలో శ్రీలంక
గాలే: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక విజయానికి చేరువైంది. మరోవైపు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమిని తప్పించుకోవాలంటే గురువారం చివరి రోజు విండీస్ మరో 296 పరుగులు చేయాలి. ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోవడంతో విండీస్‌కి ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. 348 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు లంక బౌలర్లు హడలెత్తించారు. ముఖ్యంగా రమేశ్ మెండిస్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. లంక బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక విండీస్ 18 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బోనర్, వికెట్ కీపర్ జోషువా అసాధారణ పోరాట పటిమతో విండీస్ పరువును కాపాడారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు మరో వికెట్ నష్టపోకుండా 52 పరుగులకు చేర్చారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బోనర్ 18, జోషువా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంక బౌలర్లలో లసిత్ రెండు, రమేశ్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. కెప్టెన్ కరుణరత్నె (83), మాథ్యూస్ 69 (నాటౌట్) మెరుగైన బ్యాటింగ్‌తో లంకను ఆదుకున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లంకకు భారీ ఆధిక్యం లభించడంతో రెండో ఇన్నింగ్స్‌ను త్వరగానే డిక్లేర్డ్ చేసింది. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. బౌలర్లు తమ నమ్మకాన్ని నిలబెడుతూ విండీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.