గోటబయ రాజపక్స రాజీనామాను డిమాండ్ చేసిన నిరసనకారులు
శ్రీలంక తమిళులకు సాయపడేందుకు మోడీ సాయం కోరిన స్టాలిన్
న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. ఆ దేశం దిగుమతులకు చెల్లించాల్సినదానికే సతమతమవుతోంది. భారత్ ఇప్పటికే ఫిబ్రవరిమార్చి ఆర్థిక సాయం కింద 2.4 బిలియన్ డాలర్లను అందించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ కొలంబో శివారుల్లో నిరసనలు చోటుచేసుకున్నాయి. కాగా ఆ నిరసనలను అదుపుచేయడానికి విధించిన కర్ఫూను శుక్రవారం ఎత్తేశారు. రాజపక్స ఇల్లు ‘మిరిహినా’ వెలుపల నిరసనను నియంత్రించడానికి వేలాది మందిపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్‌లను ఉపయోగించారు. నిరసనకారులు ‘గోట వెళ్లిపో. ఇంటికి వెళ్లిపో’ అంటూ నినాదాలు చేశారు. ఓ బస్సుకు నిప్పుపెట్టడమే కాకుండా అగ్నిమాపక శకటాన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కాగా నిరసన తెలిపిన 54 మందిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ నిహాల్ తల్దువా రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. నిరసన సమయంలో ఐగుగురు పోలీసులు, ఓ నిరసనకారుడు గాయపడినిట్లు ఎపి వార్తా సంస్థ పేర్కొంది. ఇదిలావుండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శ్రీలంక తమిళులకు మానవతా సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం కోరారు. నిరుద్యోగం, విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా అనేక మంది ఆర్థిక శరణార్థులు తమిళనాడుకు ఇప్పటికే చేరుకున్నారని తెలుస్తోంది. ఇంధన సరఫరా తగ్గిపోతున్నందున శ్రీలంకలో రోజుకు 13 గంటల విద్యుత్ కోత విధిస్తున్నారు. ఆర్థిక పునరుద్ధరణకు, వివిధ జాయింట్ ప్రాజెక్టుల కోసం నిపుణులను కూడా శ్రీలంక నియమిస్తోంది.
- Advertisement -