Thursday, January 23, 2025

కొత్త సీసాలో పాత సారాయి!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం:  కొందరికి యేగబోయిన తీర్ధం యెదురొస్తుంది, మరికొందరికి యెదురు చూడని కష్టం కాలికి చుట్టుకొంటుంది. శ్రీలంక ప్రజల పరిస్థితి యీ రెండో కోవకు చెందుతుంది. రాజపక్సల దుష్ట పాలన వారసత్వాన్ని వదిలించుకొని సమూల మార్పును చవిచూడాలని వారు యెంతగా తహతహలాడుతున్నారో అంతగా ఆ రోత వారిని పట్టి పీడిస్తున్నది. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేయే దేశ శాశ్వత అధ్యక్షుడుగా యెన్నిక కావడం శ్రీలంకకు యెదురైన ఆశాభంగమనే భావించాలి. దేశం నుంచి పరారై సింగపూర్‌లో తలదాచుకొంటున్న పూర్వ అధ్యక్షుడు రాజపక్స యేజెంటుగానే విక్రమ సింఘేను శ్రీలంక ప్రజలు భావిస్తున్నారు. కేవలం సంక్షోభ నివారణలో విఫలమైన అధ్యక్షుడుగానే కాక, దేశాన్ని దోచుకొని కనీ వినీ ఆర్ధిక కల్లోల కారకుడుగా గోటాబయ రాజపక్సను శ్రీలంక ప్రజలు పరిగణిస్తున్నారు.

పార్లమెంటులోని రాజపక్సకు చెందిన మెజారిటీ వర్గీయులే రణిల్ విక్రమ సింఘేను అధ్యక్ష స్థానానికి యెన్నుకొన్నారని భావించక తప్పదు. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించుకొన్న చరిత్రాత్మక జన తిరుగుబాటులో భాగంగా విక్రమ సింఘే సొంత భవనాన్ని కూడా ప్రజలు తగులబెట్టిన సంగతి తెలిసిందే. అందుచేత కొత్త అధ్యక్షుడుగా విక్రమ సింఘే పాలనకు ప్రజల మద్దతు లభించకపోగా వారి నుంచి పూర్వం మాదిరిగానే వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలున్నాయి. పూర్వ అధ్యక్షుడితో బాటే రణిల్ కూడా గతంలో రాజీనామా చేసినట్టు ప్రకటించాడు. అయినా అధ్యక్ష పదవి పోటీలో ఉండి నెగ్గడం విచిత్రం. నాలుగు దశాబ్దాల పార్లమెంటరీ అనుభవం వుండి ఆరు సార్లు ప్రధానిగా పని చేసిన రణిల్‌కు మెరుగైన అంతర్జాతీయ సంబంధాలున్నాయి. వాటిని వుపయోగించి దేశానికి ఆర్ధిక స్వస్థత తీసుకొస్తాడనుకొన్న రణిల్ అందుకు బదులుగా గోటాబయ రాజపక్సను సంతృప్తి పరచడంలోనే తలమునకలయ్యాడనే అభిప్రాయం యేర్పడింది.

అందుకే గోటాబయతో బాటు ఆయన కూడా వైదొలగిపోవాలని శ్రీలంక ప్రజలు గట్టిగా కోరుకొన్నారు. అంతవరకూ విశ్రమించబోమని భీష్మించుకొన్నారు. ప్రజల కోసం అవసరమైతే త్యాగాలకు సిద్ధపడడం కంటే, పదవిలో కొనసాగడం కోసం యెవరితోనైనా రాజీపడడానికి వెనుకాడనివాడనే ఆపఖ్యాతిని రణిల్ మూటగట్టుకొన్నాడు. మొన్న అధ్యక్షుడి పరారీకి, రాజీనామాకు దారితీసిన ప్రజా తిరుగుబాటు తర్వాత దేశమంతటా కఠిన ఎమర్జెన్సీని విధించిన విక్రమ సింఘే ఉక్కుపాదంతో తప్ప ప్రజలను మంచి చేసుకోడంతో పరిపాలించలేడని అర్ధమవుతున్నది.శాశ్వత అధ్యక్షుడుగా ఆయన గోటాబయ పదవీ కాలం లోని మిగిలిన రెండేళ్ల పాటు కొనసాగుతాడు. తనకు వ్యతిరేకంగా మరో తిరుగుబాటు గూడుకట్టుకోకుండా చూసుకోడానికైనా ఆయన, ప్రజా వ్యతిరేకతను రూపుమాపుకొని వారిని మంచి చేసుకోడానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వవలసి వుంటుంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్) నుంచి వీలైనంత త్వరగా ఆర్ధిక సాయం పొందడానికి విక్రమ సింఘే ప్రభుత్వం గట్టి కృషి చేయవలసి వుంటుంది. దానిని సాధించగలిగితే విదేశీ మారక నిధులు పెరిగి అత్యవరమయిన క్రూడాయిల్, ఆహారం, మందులు వంటివి చాలినంతగా లభించి దేశంలో వాటి ధరల అదుపు సాధ్యమవుతుంది. శ్రీలంక వద్ద ప్రస్తుతం 2 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలే వున్నాయి. దాని అప్పు సాలీన 7 బిలియన్ డాలర్ల వరకు వుంటుంది. శ్రీలంక మొత్తం రుణంలో చైనాకే 20 శాతం అప్పు వున్నట్టు సమాచారం. తగినన్ని నిధులు లేనందున విదేశీ అప్పు వాయిదాల చెల్లింపును నిలిపివేసి చేతులెత్తేసింది. ఐఎమ్‌ఎఫ్‌తో వొప్పందం కుదరడంలో జాప్యానికి యిదొక కారణమని చెబుతున్నారు.అలాగే క్రమం తప్పకుండా అప్పుకిస్తులు చెల్లించడానికి వీలుగా అధిక పన్నులు విధించాలని, వుచితాలు, రాయితీలకు స్వస్తి చెప్పాలని, ప్రభుత్వ యం త్రాంగంలో అవినీతిని అరికట్టాలని వగైరా షరతులను ద్రవ్యనిధి సంస్థ విధిస్తుంది.

అంటే పాలనను పరోక్షంగా తానే నడుపుతుంది. ఇది మళ్ళీ ప్రజాగ్రహాన్ని పెంచే ప్రమాదమున్నది. యేమైనప్పటికీ భారీ యెత్తున డాలర్ డబ్బును ఐఎమ్‌ఎఫ్ నుంచి మాత్రమే శ్రీలంక పొందగలుగుతుంది. ఆ తర్వాత ప్రధానంగా దృష్టి సారించాల్సింది గోటాబయ రాజపక్స పాలనా బాట నుంచి పూర్తిగా తప్పుకోడం, వీలైనంతగా దానికి విరుద్ధమైన పంధాను తొక్కడం. గోటాబయ, ఆయన సోదరుల అవినీతిపై దర్యాప్తుకు ఆదేశించడం అందుకోసం శక్తివంతమైన విచారణ కమిషన్లు వేయడం అవసరం. రాజపక్స కేవలం టూరిజం ఆదాయంపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపి భంగపడ్డాడు. కొవిడ్ కాలంలో అది అసాధారణంగా దెబ్బతిని ఆదాయం ఘోరంగా తగ్గిపోతున్న దశలో ప్రత్యామ్నాయ రాబడి మార్గాలను యెంచుకోలేదు. ఇప్పుడు ప్రాధాన్యాలను మార్చవలసి వుంది. టూరిజంతో బాటు దుస్తులు మున్నగువాటి యెగుమతులపై దృష్టి పెట్టవలసి వుంది. మొత్తం మీద గత పాలనకు భిన్నమైన దారిలో అడుగువేసి ప్రజల పక్షాన వున్నట్టు నిరూపించుకోకపోతే కొత్త అధ్యక్షుడుగా కూడా విక్రమ్ సింఘే మరో పెద్ద ప్రజా తిరుగుబాటును యెదుర్కోక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News