Friday, November 22, 2024

ముదురుతున్న శ్రీలంక సంక్షోభం

- Advertisement -
- Advertisement -

Sri Lanka economy crisis

అధ్యక్షుడు గొటబయకు మద్దతు ఉపసంహరించుకున్న మరో ముగ్గురు ఎంపిలు
అధ్యక్షుడు రాజీనామా చేస్తారని స్పీకర్ చెప్పారు
ప్రతిపక్ష నేత ప్రేమదాస ప్రకటన
అబద్ధాలు చెప్తున్నారన్న స్పీకర్, ఇరువురిమధ్య వాగుద్ధం
కాల్పుల ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు
చింతిస్తున్నామన్న అధ్యక్ష, ప్రధానులు

కొలంబో: తీవ్ర మైన ఆర్థిక సంక్షోభ నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు పదవినుంచి తప్పుకోవాలంటూ అన్ని వైపులనుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే 225 మంది సభ్యులున్న పార్లమెంటులో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న 165 మంది ఎంపిలలో 39 మంది మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షంతో సహా ఏ కూటమిలో చేరబోమన్న వీరంతా సభలో విడిగా కూర్చుంటామని ప్రకటించారు కూడా. రాజపక్స కుటుంబం అధికారంనుంచి తప్పుకొని అన్నిపార్టీలతో కలిపి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ కూటమి డిమాండ్ చేస్తోంది. తాజాగా బుధవారం మరో ముగ్గురు ఎంపిలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించారు. తనతో పాటుగా రహుమాన్, ఎంఎస్ తౌఫిక్‌లు మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు శ్రీలంక ముస్లిం కౌన్సిల్( ఎస్‌ఎల్‌ఎంసి) ఎంపి ఫైజల్ కాసిమ్ ప్రకటించారు.ఈ ముగ్గ్గురు కూడా ప్రతిపక్ష సమగి జన బలవెగయ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. 2020నుంచి కూడా రాజపక్సకు మిత్రపక్షంగా ఉన్న వీరు అధ్యక్షుడికి అపరిమిత అధికారాలను కట్టబెట్టే వివాదాస్పద 20ఎ రాజ్యాంగ సవరణకు అనుకూలంగా ఓటు వేశారు కూడా.

స్పీకర్, ప్రతిపక్ష నేత మధ్య వాగ్యుద్ధం

ఇదిలా ఉండగా బుధవారం శ్రీలంక పార్లమెంటులో స్పీకర్ మహింద యాప అబెయవర్దనకు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాసకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అఖిలపక్ష నేతలందరూ కోరితే అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పీకర్ తమ పార్టీ నేతలకు చెప్పారంటూ ప్రేమదాస చేసిన ప్రకటనను స్పీకర్ ఖండించడంతో గొడవ మొదలైంది. తాను అలా చెప్పలేదని, మెజారిటీ ఉన్నట్లు నిరూపించుకున్న ఎవరికైనా అధికారాన్ని అప్పగించడానికి అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారని మాత్రమే చెప్పానని స్పీకర్ అన్నారు. అయితే స్పీకర్ అబద్ధాలు చెబుతున్నారని ప్రేమదాస అరోపించగా, మీరే అబద్ధాలు చెబుతున్నారని స్పీకర్ ఎదురు దాడి చేశారు. దీంతో కొద్ది సేపు సభలో గందరగోళం నెలకొంది.

కాల్పుల ఘటనపై సర్వత్రా ఆగ్రహం
మరో వైపు పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నైరుతి శ్రీలంకలోని రాంబుక్కన ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ప్రదర్శనకారులపై మంగళవారం జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డంపై అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కాల్పుల్లో 13 మంది గాయపడగా, వారందరినీ కెగల్లె ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 15 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అధ్యక్షుడు, ప్రధాని శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రజలకున్న హక్కుకు ఎప్పుడూ భంగం కలగకూడదని తాము బలంగా నమ్ముతున్నామన్నారు.

అదే సమయంలో ప్రజలు ఆందోళన చేసే సమయంలో తమ హక్కులను అంతే గౌరవించాలని వారన్నారు. ఈ సంఘటనపై పోలీసులు నిష్పాక్షికమైన దర్యాప్తు జరుపుతారని తాను నమ్ముతున్నట్లు ప్రధాని మహింద రాజపక్స ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. నిరాయుధులైన ఆందోళనకారులపై పోలీసుల చర్యను ఐక్యరాజ్య సమితి, అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించడమే కాకుండా దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ ఘటనపై అధ్యక్షుడు, ప్రధాని విచారం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సంఘటనపై దర్యాప్తుకు శ్రీంకలోని మానవ హక్కుల కమిషన్ ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News