కొలంబో : పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా భారత్‌తోపాటు ఆరు దేశాలకు శ్రీలంక టూరిస్ట్ వీసాలు ఉచితంగా మంజూరు చేయడానికి నిర్ణయించింది. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షించడానికి చర్యలు చేపట్టింది. భారత్ నుంచే శ్రీలంకకు ఎక్కువగా పర్యాటకులు వెళ్తున్న క్రమంలో మనదేశానికి చెందిన పర్యాటకులకు ఫ్రీ టూరిస్ట్ వీసాలను మంజూరు చేయనున్నట్టు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకటించింది.
2019 ఈస్టర్ పేలుళ్లు, కొవిడ్ మహమ్మారి కారణంగా శ్రీలంకకు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రధానంగా పర్యాటక రంగం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఆధారపడే శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌తోపాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు జారీ చేయాలని గత అక్టోబర్ నెలలో క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయనుంది. మొదటి 30 రోజుల పాటు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 నుంచి అమలు లోకి వస్తుందని శ్రీలంక ప్రకటించింది.
ప్రయాణికులు వచ్చిన తరువాత డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇవ్వబడుతుంది. 30 రోజల వీసా వాలిడిటీతో శ్రీలంకలో 30 రోజులు గడపవచ్చు. శ్రీలంకకు భారత్ నుంచి పర్యాటకులు విశేష సంఖ్యలో వెళ్తుంటారు.ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ నుంచి శ్రీలంకకు 28,000 మంది వెళ్లారు. ఈ విషయంలో భారత్ తరువాత 10,000 మందితో రష్యా రెండో స్థానంలో ఉండగా, తరువాతి స్థానంలో 8000 మంది టూరిస్టులతో బ్రిటన్ ఉంది. శ్రీలంకలో 2019 లో సంభవించిన ఈస్టర్ పేలుళ్లలో 270 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో 11 మంది భారతీయులు ఉన్నారు. 500 మంది గాయపడ్డారు. ఆ తర్వాత నుంచి శ్రీలంకకు పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గింది.