మిన్నంటిన నిరసనలతో నిర్ణయం
కొలంబో : లంకలో నిరసనలు మిన్నంటుతూ ఉండటంతో పరిస్థితిని అదుపులో పెట్టేందుకు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని శనివారం అధికారులు తెలిపారు. పలు ప్రాంతాలలో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు వీధులలోకి రావడం, హింసాత్మక చర్యలు చోటుచేసుకోవడంతో పరిస్థితి క్షీణించింది. ఈ దశలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుగా సోమవారం వరకూ కర్ఫూ విధించారు. తరువాత పరిస్థితిని సమీక్షించుకుని తదుపరి నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడైంది.
లంకకు ఐఒసి ద్వారా 6000 మెట్రిక్ టన్నుల ఇంధనం
ఇంధన కొరతతో తల్లడిల్లుతున్న శ్రీలంకకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధం అయిన లంక ఐఒసి ఇంధన సరఫరాకు ముందుకు వచ్చింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందుగా తమ సంస్థ నుంచి 6000 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్‌ను అందిస్తామని అధికారులు తెలిపారు.