Wednesday, January 22, 2025

నేడు శ్రీలంక-భారత్ తొలి టి20

- Advertisement -
- Advertisement -

పల్లెకెలె: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లు కూడా కొత్త సారథుల ఆధ్వర్యంలో బరిలోకి దిగనున్నాయి. రోహిత్ శర్మ టి20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక కూడా కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడనుంది. వానిందు హసరంగ ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో చరిత్ అసలంక కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

రెండు జట్లు కూడా కొత్త సారథుల ఆధ్వర్యంలో బరిలో దిగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌లో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా అద్భుత ఆటను కనబరిచిన విషయం తెలిసిందే. ఇదే జోరును శ్రీలంకపై కూడా కనబరిచేందుకు సిద్ధమైంది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అంతేగాక టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన గౌతం గంభీర్‌కు కూడా ఇదే తొలి సిరీస్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు గంభీర్, అటు సూర్యకుమార్ తమ తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఫేవరెట్‌గా టీమిండియా..
ఇక సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, రింకు సింగ్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. గిల్, యశస్వి, సూర్యకుమార్‌లు ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. జింబాబ్వే సిరీస్‌లో యశస్వి, గిల్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.

ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిద్దరూ తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే లంక బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక సూర్యకుమార్ రూపంలో భారత్‌కు మరో పదువైన అస్త్రం ఉండనే ఉంది. టి20లలో సూర్యకుమార్ ఎదురులేని బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా సూర్యకు ఉంది. ఇక కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. రిషబ్ పంత్, హార్దిక్, శివమ్ దూబె, రింకు సింగ్‌లు కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, బిష్ణోయ్, సిరాజ్, అర్ష్‌దీప్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో భారత్‌కే సిరీస్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు ఆతిథ్య శ్రీలంక కూడా సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. సొంత గడ్డపై ఆడుతుండడం లంకకు సానుకూల పరిణామంగా చెప్పాలి. లంకలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. పాథుమ్ నిసాంకా, ఫెర్నాండో, కుశాల్ మెండిస్, కెప్టెన్ అసలంక, హసరంగ, మహీశ్ తీక్షణ, మధుశంకా, పతిరణ తదితరులతో లంక బలంగా కనిపిస్తోంది. దీంతో లంకను కూడా తక్కువ అంచనా వేయలేం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News