Thursday, January 2, 2025

లంకకు దిసనాయకే దిశానిర్దేశం

- Advertisement -
- Advertisement -

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వెలువడిన ఫలితం.. అక్కడి ప్రజలు మార్పు కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో కళ్లకు కట్టింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు చిన్న గడ్డిపరక దొరికినా అందిపుచ్చుకోవడం సహజం. గత నాలుగైదేళ్లుగా సమస్యల వలయంలో కూరుకుపోయిన లంకేయులకు అనుర కుమార దిసనాయకే అలాగే కనిపించి ఉంటారు. అందుకే, తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు పట్టం కట్టారు. అవినీతిని అంతం చేస్తాననీ, రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వాగ్దానాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఫలితంగా, గడచిన 2020 ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే పొందిన దిసనాయకే ఈసారి 42 శాతం ఓట్లతో గెలిచి, దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మునుపెన్నడూ లేనంతగా ఈసారి అధ్యక్ష పదవి కోసం 38 మంది అభ్యర్థులు బరిలోకి దిగినా, పోటీ మాత్రం నిన్నటి వరకూ అధ్యక్ష పదవిలో కొనసాగిన రణిల్ విక్రమ సింఘె, సామగి జన బలవేగాయ పార్టీ నాయకుడు సాజిత్ ప్రేమదాస, దిసనాయకేల మధ్యే జరిగింది.

దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి ప్రధాన కారకులుగా భావిస్తున్న రాజపక్సె కుటుంబం నుంచి మనల్ రాజపక్స బరిలోకి దిగినా, ఆయన ప్రభావం ఏమాత్రం లేదు. అనధికార ఒపీనియన్స్ పోల్స్ మొదటి నుంచీ దిననాయకే వైపే మొగ్గు చూపాయి. అభ్యర్థి గెలుపునకు 50 శాతానికి పైగా ఓట్లు రావలసి ఉండగా, తొలి ప్రాధాన్య ఓట్లలో మెజారిటీ మార్కును అందుకోలేకపోయిన దిసనాయకే, రెండో రౌండ్‌లో గట్టెక్కారు. శ్రీలంక చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ వరకూ వెళ్లడం ఇదే మొదటిసారి. మూడున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో దిసనాయకే జనతా విముక్తి పెరమునా పార్టీలో కీలక నేతగా ఎదిగారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలసి 2004లో పెరమునా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయనదే కీలకపాత్ర. ఆ తర్వాత ప్రభుత్వంలో వ్యవసాయ, నీటిపారుదల మంత్రిగా పనిచేశారు. గొటబాయ రాజపక్సె 2019లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో దిసనాయకే ముందువరసలో నిలబడ్డారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు యువతను కూడగట్టి, ఉద్యమాలు నిర్మించి, విద్యార్థులు, ఉద్యోగులను తనవైపు తిప్పుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రచారశైలిని సైతం కొత్త పుంతలు తొక్కించారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తాననడం ద్వారా యువతను, అవినీతిని నిర్మూలిస్తానని, ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తానని హామీలు ఇవ్వడం ద్వారా పేదప్రజలను ఆకట్టుకున్నారు.

ప్రజల మనసెరిగి నిర్ణయాలు తీసుకోవడం లో దిసనాయకే దిట్ట అని ఆయనను దగ్గర నుంచి చూసినవారు చెబుతారు. తాను నేతృత్వం వహిస్తున్న జనతా విముక్తి పెరమునా పార్టీ గతంలో హింసను ఎగదోసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 1987- 89 మధ్యకాలంలో భారత్‌తో లంక ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని పెరమునా పార్టీ వ్యతిరేకించడం ద్వారా పెద్దయెత్తున అల్లర్లు చెలరేగి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 2014లో దిసనాయకే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ఎనభయ్యవ దశకం చివరినాళ్లలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు క్షమాపణలు చెప్పడం ద్వారా పార్టీ పట్ల ప్రజలలో నెలకొన్న అభిప్రాయాన్ని మార్చగలిగారు. అయితే లంక దేశాధీశుడికి పాలన నల్లేరుపై నడక కాబోదనే చెప్పడంలో సందేహం లేదు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం తన ప్రధాన లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పిన దిసనాయకే, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని దేశమంతా ఎదురు చూస్తోంది. ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు పెద్దపీట వేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

లంకను ఒడ్డున పడేయడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి 2.9 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటిస్తూ, కఠినమైన షరతులు విధించింది. సదరు షరతులను సడలించే విషయంలో ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు జరుపుతానని కూడా ఆయన హామీ ఇచ్చారు. స్వతహాగా వామపక్షవాది అయిన దిసనాయకే, చైనా అనుకూలుడిగా ముద్ర వేసుకున్నారు. ఆయన ఎన్నికైతే లంక చైనా చేతిలోకి వెళ్లిపోతుందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి కూడా. శ్రీలంకకు ప్రధాన రుణదాతలుగా ఉన్న చైనా, ఇండి యా, జపాన్ దేశాలు ఇప్పటికే లంకలో అనేక కీలకమైన ప్రాజెక్టులను చేజిక్కించుకున్నాయి. దిసనాయకే అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో భారత్-శ్రీలంక మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడవలసిన అంశం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News