Wednesday, January 22, 2025

శ్రీలంక జయకేతనం

- Advertisement -
- Advertisement -

బులవాయో: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో శ్రీలంక 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నమెంట్‌లో శ్రీలంక పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 47.4 ఓవర్లలో 213 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని తమ జట్టుకు విజయం సాధించి పెట్టారు. సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు విక్రమ్‌జీత్ సింగ్, మాక్స్ డౌడ్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఈ దశలో వెస్లీ, బాస్ డి లీడ్‌లు సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు.

ఇద్దరు లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. వెస్లీ ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన వెస్లీ 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు సాధించాడు. అయితే కుదురుగా ఆడుతున్న వెస్లీ లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. తేజ నిడమనురు సున్నాకే ఔటయ్యాడు. లీడ్ 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేక పోయాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్కాట్ 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. మిగతవారు విఫలం కావడంతో నెదర్లాండ్స్‌కు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మహీశ్ తీక్షణ మూడు, వనిందు హసరంగ రెండు వికెట్లు తీశారు.

ఆదుకున్న ధనంజయ
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు కూడా శుభారంభం లభించలేదు. నెదర్లాండ్స్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ లంక బ్యాటర్లను హడెలెత్తించారు. ఓపెనర్ నిసాంకా (0) సున్నాకే ఔటయ్యాడు. వన్‌డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (10) జట్టును ఆదుకోలేక పోయాడు. సమరవిక్రమ (1). అసలంక (2)లకు కూడా విఫలమయ్యారు. దీంతో లంక 34 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ధనంజయ డిసిల్వా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తనపై వేసుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కరుణరత్నె 33 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన ధనంజయ 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 93 పరుగులు సాధించాడు. వనిందు హసరంగ (20), మహీశ్ తీక్షణ (28) తమవంతు సహకారం అందించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, లీడ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News