Saturday, January 11, 2025

లంక అధ్యక్షుడు రాజపక్సా ఫరార్

- Advertisement -
- Advertisement -

లంక అధ్యక్షుడు రాజపక్సా ఫరార్
నిరసనలు జెండాలతో జనం దండుయాత్ర
ప్రెసిడెంట్ భవనం ముట్టడి
వెంట సూట్‌కేసులు ఓ బృందం
విదేశాలకా? సైనిక కేంద్రానికా
దిక్కుతోచని స్థితితో జనం తిరుగుబాట?
చేతకాని సర్కారుపై ఫైర్
అఖిలపక్ష ప్రభుత్వం తథ్యం?
ప్రధాని విక్రమసింఘే రాజీనామా?
కొలంబో: పొరుగు దిగువ దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్థంపై జనాగ్రహం కట్టలు తెంచుకుని వెల్లువెత్తింది. శనివారం నిరసనకారులు దేశ రాజధాని కొలంబోలోని దేశ అధ్యక్షులు గొటాబయ రాజపక్సా నివాసాన్ని చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో రాజపక్సా సైనిక దళం కాపలా నడుమ పరారయ్యారు. ప్రెసిడెంట్ భవనం వద్ద అమర్చి ఉన్న బారికేడ్లను తీసిపారేసి, అడ్డంకులను ధ్వంసం చేస్తూ జనం ముందుకు సాగారు. నిరసనకారులు అధ్యక్షుడి కార్యాలయాన్ని, పూర్తి నివాసాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడనే తిష్టవేశారు. శ్రీలంకలో దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక దుస్థితి నెలకొంది. ఈ విషమ పరిణామాల ప్రభావం మధ్య తరగతి ప్రజలు, ప్రత్యేకించి సామాన్యుడి జనజీవితాలను దెబ్బతీశాయి. అధికారంలోని వారు తమను ఆదుకునే పరిస్థితి లేదని గ్రహించిన జనం తమ నిరసనలను మరింతగా ఉధృతం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంత్రుల రాజీనామాలకు వ్యవహారం దారితీసింది. దేశాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టి, క్రమేపీ పరిస్థితులు చక్కదిద్దుతానని ప్రకటనలు వెలువరించిన గొటాబాయ రాజపక్కా చేతలపై నమ్మకం సన్నగిల్లిన దశలో శనివారం అధ్యక్ష భవనం దాడికి గురై, అధ్యక్షుడి పలాయనానికి దారితీసింది. ఇది దేశ చరిత్రలో ఎప్పుడూ చవిచూడని ఘట్టం అయింది. అధ్యక్షుడి నివాస ప్రాంతం అంతా ప్రభుత్వ వ్యతిరేకులు, నిరసనకారుల వెల్లువతో మహా జాతర వాతావరణాన్ని తలపించింది. వయస్సు తారతమ్యం లేకుండా పిల్లలు పెద్దలు, మహిళలు తరలివచ్చారు.

అధ్యక్ష భవనం నిరసనల ఆటలకు మైదానం అయింది. ఇక్కడి వాతావరణాన్ని స్థానిక టీవీ న్యూస్ న్యూస్ ఫస్ట్ ఛానల్ చిత్రీకరించి, ప్రసారం చేసింది. నిరసనకారులు దేశ జాతీయ జెండాలు, హెల్మెట్లు పట్టుకుని తరలివచ్చారు. అక్కడున్న భద్రతా యంత్రాంగం అదుపు చేయలేని స్థితి ఏర్పడింది. కొవిడ్ సంక్షోభం మిగిల్చిన ఆర్థిక సంక్షోభం, కీలక ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం చితికిపోవడం, తరువాత రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో నిలిచిపోయిన చమురు సరఫరా, విదేశీ మారక ద్రవ్య నిల్వలకు గండితో జనం నిత్యజీవితావసరాలకు కూడా సరిపడా సరుకులు అందకపోవడం రాజకీయ అధికారిక వ్యవస్థ చేతులెత్తేసిన స్థితిలో ఉండటంతో నిరసనలు ప్రజ్వరిల్లాయి. మార్చి నుంచి కూడా ఎక్కువగా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తూ వచ్చిన జనం దేశాధ్యక్షుడి రాజీనామాకు పట్టుపట్టారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎటువంటి ముందస్తు సంకేతాలు లేని విధంగా జనం అధ్యక్షుడి అధికార నివాసాన్ని లక్షంగా ఎంచుకుని తరలివచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లిందని రాయిటర్స్ తెలిపింది. పోలీసులు గాలిలో కాల్పులు జరిపి నిరసనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. అయితే ముందుకు దూసుకువెళ్లే జనాన్ని ఏ స్థాయిలోనూ అదుపులో పెట్టలేకపోవడంతో అధ్యక్షులు ప్రజల ముందుకు రాలేక భవనం వీడి వెళ్లాల్సి వచ్చింది. ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడ తలదాచుకుంటున్నారనేది వెనువెంటనే వార్తా సంస్థలు నిర్థారించలేకపొయ్యాయి. నిరసనకారుల ఉధృతికి ముందే ఆయన భవనం వీడిపోయినట్లు వెల్లడైంది. ఆయనను సైనిక కేంద్ర కార్యాలయానికి హుటాహుటిన తరలించినట్లు వెల్లడైంది. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య నెలకొన్న ఘర్షణలలో పోలీసులు సహా 50 మంది వరకూ గాయపడ్డట్లు తొలివార్తలతో స్పష్టం అయింది.
ట్రక్కులు, బస్సులు, రైళ్లలో తరలివచ్చిన జనం
దేశంలో తీవ్రస్థాయి ఇంధన కటకట రవాణా వ్యవస్థను దెబ్బతీసినా ఇప్పటి నిరసనలకు జనం దూర ప్రాంతాల నుంచి కొలంబోకు పలు రకాల వాహనాలలో తరలివచ్చారు. బస్సులు, ట్రక్కులు, కొందరు ద్విచక్రవాహనాలు, రైళ్లలో మారుమూల ప్రాంతాల నుంచి కొలంబో మజిలీగా జనం దూసుకువచ్చింది. దీనితో కొలంబో జనసంద్రం అయింది. దేశాధ్యక్షుడి భవన పరిసర ప్రాంతాల్లో జనావాసాలు నెలకొన్న పరిస్థితి ఏర్పడింది. ఎన్నాళ్లీ ఆర్థిక దుస్థితి, ఎంతకాలానికి తమకు మునుపటి జీవితం? ఎప్పటికి రోజువారి కూలీల ఉపాధి దక్కుతుందని నిరసనలతో జనం కదిలారు. ఆర్థికదుస్థితి నుంచి గట్టెక్కించలేని పాలకులు అధికార భవనాలలో ఉండటానికి అర్హత పోగొట్టుకున్నారని నిరసనకారులు స్పందించారు.
అధికారానికి అతుక్కుపోయిన గోటాను సహించేది లేదు
నెగంబో జాలరి సంపత్ పెరెరా ఆగ్రహం
ముందు జనం బతుకులు తీర్చిదిద్దు లేదా గద్దెదిగిపో అని చాలా నెలలుగా గొటాబయకు హెచ్చరికలు వెలువరిస్తూ ఉన్నా, ఆయన పట్టించుకోవడం లేదని 37 ఏండ్ల జాలరి సంపత్ పెరెరా తెలిపారు. ఆయన సముద్ర తీర ప్రాంత పట్టణం నెగోంబో నుంచి కొలంబోకు నిరసనలకు తరలివచ్చారు. జనం గోడు పట్టని వారు , జనం కష్టాలు తీరిగ్గా తీరుస్తామని చెప్పే వారిని ఎంతకాలం భరిస్తామని ప్రశ్నించారు. ఈ విధంగా లక్షలాది మంది కొలంబోకు బహుదూరాల నుంచి తరలివచ్చారు. దీనితో కొలంబో లంక నిరసనకారుల మయం అయింది.
రాజకీయ సంక్షోభం మరింత తీవ్రతరం
జనం నిరసనలతో జడిసి దేశాధ్యక్షులు గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లడంతో లంకలో ఇప్పటికే గందరగోళంగా ఉన్న రాజకీయ పరిస్థితి మరింత దిగజారింది. పాలనా పగ్గాల వ్యక్తి ఫరారుతో ప్రభుత్వ అధికార యంత్రాంగం మరింత అయోమయానికి లోనయింది. తక్షణం దేశ రాజకీయ వ్యవస్థను క్రమబద్థీకరించాల్సిన అవసరం ఉందని లేకపోతే సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరించారు. దేశంలో ఇంధన ఆర్థిక వ్యవస్థలకు గండిపడటంతో పలు ప్రాంతాలలో స్కూళ్లు, రవాణా వ్యవస్థలు, కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ లేకుండా పోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా బ్రేక్‌లు పడి, ప్రభుత్వం మూతపడే స్థితి వచ్చిందని, ఇది ఎక్కడికి దారితీస్తుందని ప్రశ్నలు తలెత్తాయి.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కరుణించేనా?
దేశ ఆర్థిక పరిస్థితి చక్కబడేనా
దేశంలో ద్రవ్యోల్బణం జూన్ చివరి నాటికి అసాధారణ రీతిలో 55 శాతానికి చేరుకుంది. ఆర్థిక గడ్డు స్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వాధినేతలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సాయానికి అభ్యర్థించారు. కీలక దేశాల సాయం కోరారు. ప్రత్యేకించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి తక్షణరీతిలో 3 బిలియన్ డాలర్ల సాయం కావాలని లంక మొరపెట్టుకుంది. బెయిలౌట్‌కు ఈ సాయం అవసరం. ఇక విదేశీ మారకద్రవ్యం భారీగానే కావాల్సి ఉంటుంది. విదేశీ రుణాలను పునర్వస్థీకరించాలి. తమకు తలెత్తిన డాలరు కరువు తట్టుకుని నిలిచేందుకు బహుళ, ద్వైపాక్షిక స్థాయిల వర్గాలు వనరుల నుంచి నిధుల సేకరణకు ప్రయత్నాలు జరిగాయి. అయితే రాజకీయ అస్థిరతతో ఉన్న దేశానికి సాయంపై ఐఎంఎఫ్ ఇతర సంస్థలు తర్జనభర్జనలకు దిగుతూ వచ్చాయి. దీనితో ఎటూ తేలని స్థితిలో సాయం ఉండగా ఇప్పుడు దేశాధ్యక్షుడి పతనావస్థ ఈ ఆర్థిక సహాయ అంశానికి తీవ్ర విఘాతం అవుతుందని భావిస్తున్నారు. అయితే భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపదేశాన్ని ఇప్పుడున్న రాజకీయ అస్థిరత నుంచి బయటపడేసేందుకు తక్షణ రీతిలో ఆర్థిక సంస్థలు ముందుకు వస్తాయని లంక ఆర్థిక వేత్తలు కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు.
లంక నేవీషిప్‌లోకి భారీగా సూట్‌కేసుల భట్వాడా
దేశాధ్యక్షుడి పరారుకు ముందు ఆయన అధికార నివాసం నుంచి వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన పెద్ద పెద్ద సూట్‌కేసులను తీసుకువెళ్లడం సముద్రతీరంలో ఉన్న లంక సైనిక నౌకాదళ షిప్‌లో ఉంచడం వంటి వీడియోలు ఇప్పుడు నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఫరారీకి ముందు రాజపక్సాకు చెందిన సొమ్ము లేదా కీలక పత్రాలతో ఈ సూట్‌కేసులు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. లంగరువేసి ఉన్న ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ గజబాహూ నౌకలోకి సూట్‌కేసులు వెళ్లినట్లు, తరువాత రాజపక్సా కూడా ఇందులో దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి కానీ మరో సరక్షిత ప్రాంతానికి కానీ వెళ్లినట్లు స్థానిక మీడియాలు వార్తలు వెలువరించాయి. ప్రెసిడెంట్ సూట్‌కేసులతో పరారు అయ్యాడని, దేశాన్ని సముద్రంలో నెట్టాడని నెటిజన్లు వ్యాఖ్యలు వెలువరించారు. ఆయనకు ఆయన ప్రాణాలు దక్కడం ముఖ్యం, జనం రోజువారి సమస్యలు తీర్చడం వారికి దిక్కు చూపడం తరువాయి అని స్పందించారు. ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ సిందూరల, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ గజబాహూలలోకి కొందరితో కూడిన బృందం తీరం దాటి వెళ్లిందని, కొలంబో రేవు వద్ద ఉండే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే బోట్లలోకి ఎక్కింది ఎవరు ఎక్కడికి పోతున్నారనేది తాను తన విధుల కారణంగా వెల్లడించలేనని స్పష్టం చేశారు. అయితే రాత్రికి రాత్రే ప్రెసిడెంట్ తన మకాంను ఆర్మీ హెడ్‌క్వార్టరుకు మార్చినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
దేశం వీడి వెళ్లాడా? లంకలోనే ఉన్నాడా
రాజపక్సా ఇప్పటికే దేశం విడిచి విమానంలో వెళ్లాడని ప్రచారం జరుగుతోంది. ప్రెసిడెంట్‌కు చెందిన ఓ అధికార కాన్వాయ్ కొలంబోలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లిందని స్థానిక టీవీ ఛానల్ ఒకటి తెలిపింది. అయితే ఆయన వేరే దేశం వెళ్లింది లేనిది నిర్థారణ కాలేదు.
స్విమ్మింగ్ పూల్‌లో జనం ఈతలు
వేలాది మంది జనం ప్రెసిడెంట్ అధికార నివాస ఆవరణలోకి చొరబడ్డారు. వందలాది మంది భవనంలోకి చొచ్చుకుపోయి, హాళ్లల్లో విశాలమైన గదులలో కలియతిరుగుతున్నట్లు వెల్లడైంది. కొందరు యువకులు పిల్లలు ఇక్కడి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఈదుతూ ఉన్నప్పటి ఫోటోలు కూడా ప్రత్యక్షం అయ్యాయి.
నిరసనకారులతో కలిసి జెండాతో మాజీ క్రికెటర్ జయసూర్య
దేశాధ్యక్షుడి భవన ముట్టడికి దిగిన జనంతో కలిసి లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ప్రముఖంగా నిలబడి ఉన్నారు. జాతీయ జెండా చేతపట్టుకుని ఉన్న జయసూర్య ‘జనం ముట్టడి కీలక ఘట్టానికి చేరుకుంది. మీ కోట బురుజులు బద్ధలవుతున్నాయి. రాజపక్సా ఇక రాజీనామాకు దిగు. లేకపోతే ఎటువెళ్లలేని స్థితి ఏర్పడుతుంది’ అని జయసూర్య స్పందించారు.

Sri Lanka President Rajapaksa Escaped

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News