Monday, January 20, 2025

లంకలో రాజుకున్న ఎన్నికల వేడి

- Advertisement -
- Advertisement -

ద్వీపదేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. దేశాధ్యక్ష పదవి కోసం 39 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదేళ్ల క్రితం 2019లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స గెలవగా, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సోదరుడు మహింద రాజపక్స గెలిచి అధికారంలోకి వచ్చారు. అది మొదలు అన్నదమ్ముల హయాంలో లంకేయుల జీవన స్థితిగతులు మరీ క్షీణించాయి. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడిపోయింది. దశాబ్దాల తరబడి లంక రాజకీయాలను శాసించిన రాజపక్స కుటుంబీకులవల్లే ఈ పరిస్థితి దాపురించిందంటూ ఆగ్రహించిన ప్రజానీకం తిరుగుబాటు లేవనెత్తారు.

మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయగా, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో గొటబాయ కూడా తన అధ్యక్ష పదవికి నీళ్లు వదలాల్సి వచ్చింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, ప్రధాని దినేశ్ గుణవర్థనె దేశాన్ని గాడిన పెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నది వాస్తవం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 290 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేసినా అది ఏమూలకూ చాలకపోగా, చైనా సహా అనేక దేశాలనుంచి రుణాలు తెచ్చి పాలన సాగిస్తున్నారు. కఠినతరమైన సంస్కరణలను చేపట్టి దేశాన్ని మళ్ళీ పట్టాలెక్కించేందుకు తిప్పలు పడుతున్నారు. గత నవంబర్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా విక్రమ సింఘె ‘ఆర్థిక వ్యవస్థను కొంతవరకూ గాడిలో పెట్టగలిగినా, ప్రజలు ఇంకా అవస్థలు పడుతున్నారన్నది నిజం’ అన్న ఆయన మాటల్లో వాస్తవం లేకపోలేదు. 2022లో 70 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసి, 1.5 శాతానికి తీసుకురావడంలో వారిద్దరి కృషి ఎంతో ఉంది. సెప్టెంబర్ 21న జరిగే ఎన్నికల్లో మరోమారు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన యునైటెడ్ నేషనల్ పార్టీ సీనియర్ నేత విక్రమ్ సింఘె ఈసారి వ్యూహాత్మకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

ఆయనకు 30కిపైగా రాజకీయ పార్టీలు, సంఘాలూ మద్దతు పలుకుతున్నాయి. ఇక రాజపక్సల కుటుంబం నుంచి మాజీ ప్రధాని మహింద రాజపక్స తనయుడు నమల్ రాజపక్స (శ్రీలంక పొదుజన పెరమున) బరిలోకి దిగారు. వీరితోపాటు విపక్ష నేత సజిత ప్రేమదాస, నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్ పిపి) నేత అరుణ కుమార దిశనాయకే పోటీలో ఉన్నారు. శ్రీలంకలో జరుగుతున్న ఈ అధ్యక్ష ఎన్నికలు చైనా -భారత్‌లకు వ్యూహాత్మకంగా కీలకమైనవని చెప్పవచ్చు. సముద్ర తీర ప్రాంత దేశాలను తన వైపుకు తిప్పుకునేందుకు భారీ మొత్తాలలో రుణాలు అందజేస్తూ ఆ దేశాలలో పాగా వేయడం చైనా వ్యూహం. మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ దేశాలలో ఇదే వ్యూహాన్ని అమలు చేసి, విజయం సాధించిన చైనా శ్రీలంకలోనూ ఇప్పటికే పాగా వేసింది.

రాజపక్స సోదరులు అధికారంలో ఉన్న సమయంలో హంబన్ టొటా పోర్టును 99 ఏళ్లపాటు చైనాకు లీజుపై కట్టబెట్టారు.అక్కడే చైనా కంపెనీ ఒక ఆయిల్ రిఫైనరీని కూడా ఏర్పాటు చేస్తోంది. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అమెరికా, ఇండియా సైతం శ్రీలంకలో పెట్టుబడులకు దేశీయ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవలే అదానీ గ్రూప్ భారీయెత్తున పవన విద్యుత్ ప్రాజెక్టులు, కొలంబోలో పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. శ్రీలంకతో ఇండియాను కలుపుతూ భూమార్గం నిర్మించాలనే ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఇది సాకారం దాల్చితే ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్ఠం కావడంతోపాటు వాణిజ్య అవకాశాలు ఊపందుకుంటాయి.

ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో విజేతను బట్టి భారత్- లంక సంబంధాలు ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు. శ్రీలంకను తమ వైపు తిప్పుకునేందుకు చైనా, ఇండియా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె వ్యూహాత్మకంగా ఇరు దేశాలకూ పెద్దపీట వేస్తూ తమ దేశ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో కుమార దిశనాయకేకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరొకసారి విక్రమ సింఘెను విజయం వరిస్తే చైనా, భారత్‌ల పట్ల ఆయన వైఖరి మునుపటి మాదిరిగానే కొనసాగుతుందని భావించవచ్చు. వామపక్షవాదిగా ముద్రపడిన దిశనాయకే గెలిస్తే మాత్రం చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇండియా ప్రాబల్యానికి ఎదురు దెబ్బ తగలక తప్పదన్నమాటే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News