Sunday, December 22, 2024

చమరి నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

మలేసియాపై శ్రీలంక రికార్డు విజయం
దంబుల్లా: మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు నయా చరిత్ర సృష్టించింది. సోమవారం మలేసియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 144 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. మహిళల టి20 క్రికెట్‌లో శ్రీలంకకు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మలేసియా ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక కేవలం 40 పరుగులకే కుప్పకూలింది. మలేసియా టీమ్‌లో ఎల్సా హంటర్ (10) మాత్రమే రెండంకెల స్కోరును అందుకుంది.

మలేసియా టీమ్‌లో నలుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. శ్రీలంక బౌలర్లలో శశినీ మూడు, కావ్య కావింది, కవిషా, దిల్హరి రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను కెప్టెన్ చమిర ఆటపట్టు విధ్వంసక శతకంతో ఆదుకుంది. మలేసియా బౌలర్లను హడలెత్తించిన ఆటపట్టు కళ్లు చెదిరే శతకాన్ని సాధించింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన చమరి ఆటపట్టు వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారిచింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడిన ఆటపట్టు అభిమానులు కనువిందు చేసింది. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన ఆటపట్టు 69 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, 14 బౌండరీలతో 119 పరుగులు చేసింది. ఈ క్రమంలో మహిళల ఆసియాకప్‌లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. కాగా వరుసగా రెండో విజయం సాధించిన శ్రీలంక సెమీ ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News