ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చరిత్ అసలంక అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అసలంక 14 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 127 పరుగులు సాధించాడు. దునిత్ వెల్లలాగే (30), కుసాల్ మెండిస్ (19) తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో అబాట్ మూడు, హార్ది, జాన్సన్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
తర్వాత ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. ఆసీస్ టీమ్‌లో అలెక్స్ కేరీ (41), హార్డి (32), సీన్ అబాట్ (20), ఆడమ్ జంపా (20) నాటౌట్ మాత్రమే రాణించారు. మిగతావారు విఫలం కావడంతో కంగారూలకు ఓటమి తప్పలేదు. ఇక లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ నాలుగు, ఫెర్నాండో, వెల్లలాగే రెండేసి వికెట్లను పడగొట్టారు.