శ్రీలంక అధ్యక్షుడు అనురా దిస్సనాయకె ఈ నెల 15 నుంచి 17 వరకు భారత్‌ను సందర్శించనున్నారని మంగళవారం కొలంబోలో ప్రకటించారు. దిస్సనాయకె ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారని శ్రీలంక క్యాబినెట్ అధికార ప్రతినిధి నలిందాజయతిస్స కొలంబోలో విలేకరులతో చెప్పారు. దిస్స నాయకె వెంట విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరత్, ఆర్థిక శాఖ ఉప మంత్రి అనిల్ జయంత ఫెర్నాండో ఉంటారని శ్రీలంక ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన జయతిస్స తెలిపారు.
దిస్సనాయకె సెప్టెంబర్‌లో అధ్యక్ష పదవిని స్వీకరించిన తరువాత మొదటిసారిగా విదేశీ పర్యటన జరపబోతున్నారు. దిస్సనాయకె విజయం తరువాత 15 రోజుల్లోగానే కొలంబో సందర్శించిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనకు భారత్ పర్యటన కోసం ఆహ్వానం అందజేశారు. దిస్సనాయకె సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) ప్రభుత్వం సెప్టెంబర్ 23న అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీలంకను సందర్శించిన తొలి విదేశీ ప్రముఖుడు జైశంకర్.