న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్ విక్రమ్‌సింఘేతో మమత బుధవారం కొద్ది సేపు భేటీ అయ్యారు. ఈ దశలో విక్రమ్‌సింగ్ మమతతో ఇండియా కూటమికి సారధ్యం వహిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి మమత ఓ మై గాడ్ అని స్పందించారు. విక్రమ్‌సింఘేను కలిసినప్పటి ఫోటోలు వీడియోలను ఆ తరువాత మమత వెలువరించారు.
కొన్ని విషయాల ప్రస్తావన తరువాత శ్రీలంక నేత నుంచి అనూహ్యంగా ఈ ప్రశ్న తలెత్తడంతో కాసేపు మమత కంగుతిన్నారు. ఏది ఏమైనా అన్ని విషయాలు ప్రజలపైనే ఆధారపడి ఉంటాయని వివరణ ఇచ్చారు. అయితే తనకు సరైన సమాధానం దక్కలేదని విక్రమ్‌సింఘే నవ్వుతూ చెప్పారు. దీనిపై కొనసాగింపు ఇష్టపడని మమత మాటమార్చేస్తూ, కోల్‌కతాలో జరిగే బిజినెస్ సమ్మిట్‌కురావాలని ఆహ్వానించారు.
పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ 12 రోజుల విదేశీ పర్యటనకు ప్రత్యేకించి వ్యాపార, వాణిజ్య విషయాలపై వివిధ దేశాలలో చర్చలకు బయలుదేరి వెళ్లారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేది, వ్యాపార దిగ్గజ బృందం ఒకటి మమత వెంబడి ఉంది. ఐదేళ్లలో మమత విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో పెట్బుబడుల సమీకరణకు దౌత్య యత్నాల కోసం ఈ పర్యటన తలపెట్టారు. స్పెయిన్, యుఎఇలలో ఆమె తమ బృందంతో పర్యటిస్తారు.