కొలంబో: వచ్చే నెల(సెప్టెంబర్) 21న జరగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న 39 మంది అభ్యర్థులలో ఒకరు మరణించారు. శ్రీలలంక అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాయువ్య పుట్టాలం జిల్లాకు చెందిన ఇద్రూస్ మొహమ్మద్ ఇలియాస్(79) గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారని ఆయన కుటుంబ సభ్యు తెలిపారు. 1990వ దశకంలో జాఫ్నా జిల్లా నుంచి ముస్లిం మైనారిటీల తరఫున పార్లమెంట్ సభ్యునిగా ఆయన కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఇలియాస్‌కు ఇంజక్షన్ సిరంజీ చిహ్నంగా లభించింది.
బ్యాలట్ పేపర్‌లో ఆయన పేరు పైనుంచి వరుస క్రమంలో నాలుగవ స్థానంలో ఉంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో నలుగురు అధికంగా పోటీ చేస్తున్నారు. ఇలియాస్ మరణించినప్పటికీ ఆయన పేరును బ్యాలట్ పేపర్ నుంచి తొలగించలేమని ఎన్నికల కమిషన్ అధికాఉలు వెల్లడించారు. 1994 అధ్యక్ష ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి ఆత్మాహుతి బాంబు పేలుడులో మరణించగా ఆయన భార్య పేరును బ్యాలట్ పత్రంలో మార్చడం జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస, మార్కిస్టు జనతా విముక్తి పెరమున నాయకుడు అనుర కుమార దిసనాయకె, ప్రధానంగా పోటీలో ఉన్నారు.