ఒక చిన్నారితో సహా 8 మంది తమిళ జాతీయులను 2000 సంవత్సరంలో హతమార్చినందుకు శిక్ష అనుభవిస్తున్న ఒక సైనికుడికి క్షమాభిక్ష ప్రసాదించిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్షకు శ్రీలంక సుప్రీంకోర్టు శుక్వారం సమన్లు జారీచేసింది. శ్రీలంకలో 1978లో అధ్యక్ష తరహా పాలన ప్రమేశపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఒక హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న తన సన్నిహత అనుచరుడికి రాజపక్స(74) క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించిన ఐదు నెలల తర్వాత మరో కేసులో మాజీ అధ్యక్షుడికి దేశ అత్యున్నత న్యాయస్థానం సమన్లు జారీచేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఉత్తర జాఫ్నా జిల్లాలోని మిరుసువిల్‌లో 2000 సంవత్సరంలో ఎల్‌టిటిఇతో సాయుధ పోరు సందర్భంగా ఒక చిన్నారితోసహా 8 మంది తమిళ జాతీయులను సునీల్ రత్నాయకె అనే సైనికుడు హత్య చేశాడు. ఈ కేసులో అతడిని దోషిగా కోర్గు తేల్చింది. అతనికి 2020లో అప్పటి అధ్యక్షుడు రాజపక్స క్షమాభిక్ష ప్రసాదించారు. ప్రజా తిరుగుబాటులో 2022లో రాజపక్స పదవీచ్యుతులయ్యారు. ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జారీచేసిన సమన్లకు రత్నాయకెకు ఎందుకు క్షమాభిక్ష ఇవ్వవలసి వచ్చిందో రాజపక్స కారణాలు వివరించాల్సి ఉంటుంది. తదుపరి విచారణ సెప్టెంబర్‌లో జరగనున్నది. సెప్టెంబర్ విచారణకు రాజపక్సతో కలసి హాజరుకావాలని రత్నాయకెను సుప్రీంకోర్టు ఆదేశించింది.