Thursday, January 23, 2025

ఈనెల 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కలియుగ వైకుంఠం భద్రాచలంలో రాములోరికి మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కల్యాణ తేదీని ఆలయ అధికారులు శనివారం వెల్లడించారు. మార్చి 30వ తేదీన కల్యాణ క్రతువు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అనంతరం మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం, మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కల్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు, కల్యాణం, పట్టాభిషేకాన్ని భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేసేందుకు అధికారులు తలమునకలయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కల్యాణానికి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం

ఈ ఏడాది రాముల వారి కల్యాణానికి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం, ఒక క్వింటాలకు పైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. పుష్కర సామ్రాజ్య పట్టాభిషే కానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి, గంగాధర, శ్వేత పుష్కరిణి, నర్మద, పూరిలోని సముద్రం తీర్థాన్ని తూర్పు దిక్కు నుంచి తీసుకురానున్నారు. గోపీ తలాబ్, పుష్కర్, చంద్రభాగ జలాన్ని పాత్రల్లో పడమర దిక్కు నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఉత్తరంలోని గంగ, యమున, సరస్వతి, సరయు, గోమతి నదులను గుర్తించారు. దక్షిణంలోని కావేరి, తామ్రపర్ణి, పినాకిని, కపిల తీర్థం, తిరుమల స్వామి పుష్కరిణి, పద్మ పుష్కరిణి, అనంత పుష్కరిణి, కల్యాణ పుష్కరిణి, ఇంద్ర పుష్కరిణి, శ్రీరామ పుష్కరిణి వంటి చోట్లకు వెళ్లనున్నారు. ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి తీసుకొచ్చే సంప్రదాయం ఉన్నందున ఆహ్వాన పత్రికలను సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News