Monday, December 23, 2024

సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ

- Advertisement -
- Advertisement -

శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్
శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర
మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ
ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు
అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు
ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీరామనగరంలో శ్రీ రామానుజ స్వామి వారి సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం, రామానుజ వెయ్యేళ్ల వేడుక త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి సారధ్యంలో బుధవారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీరామనగరంలో త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆశ్రమంనుంచి పెరుమాళ్ల లక్ష్మీనరసింహస్వామి వారి శోభయాత్ర అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈక్రమంలో చిన్న జీయర్‌స్వామి ఆధ్వర్యంలో అహోబిల రామానుజ జీయర్‌స్వామి, దేవనాథ రామానుజ జీయర్‌స్వామి,రామచంద్ర రామానుజ జీయర్‌స్వామిల పర్యవేక్షణలో వేలాది మంది రుత్వికులు, పీఠాధిపతులు, ఆశ్రమ విద్యార్థుల శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రోచ్ఛరణతో పల్లకిలో పెరుమాళ్లు యాగశాలకు చేరుకున్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ యాత్ర ప్రారంభమై పెరుమాళ్లు యాగశాలకు చేరుకున్న అనంతరం యాగ,హోమాలను శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మిక చరిత్రపుటల్లో సువర్ణాక్షాలతో లిఖించబడే శ్రీ రామానుజ సహస్రాబ్ధి సమారంభం బుధవారం నుం చి ఈనెల 14 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. లోక కల్యాణార్ధం కోసం చిన్న జీయర్‌స్వామి తలపెట్టిన సహస్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ మహాయాగానికి బుధవారం ఉదయం రుత్వికులు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగం గా యాగశాలలో జరగాల్సిన 1035 కుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ యాగ కార్యక్రమానికి పూర్వరంగంగా వాస్తుపురుషుడి పూజ జరిపించడానికి శ్రీరామచంద్ర పెరుమాళ్ అశ్వవాహన రూరుడై వైభవోపేతంగా ఊరేగింపుగా శోభాయాత్రతో యజ్ఞస్ధలికి విచ్చేశారు. తొలుత స్ధల దోషనివారణకు వాస్తు పురుషుని చిత్రపటాన్ని పిండితో చిత్రీకరించి వాస్తుపూజ నిర్వహించారు. అనంతరం మహక్రతువులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండ, వాస్తు యజ్ఞం, పూర్ణహూతి క్రతువులు జరిగాయి. ఆ తరువాత పుణ్యహ వచనం, హోమసామాగ్రి శుద్ది. రుత్విక్ వరణ, యజ్ఞం నిర్వహించే రుత్వికులకు, యజ్ఞ హోతలకు దీక్షావస్త్రాలు సమర్పించారు.

సమతాక్షేత్రంలో సాంస్కతికి శోభ :

ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి వారి సమతాక్షేత్రం తెలుగు సంస్కృతిని ప్రతిభింబించే సాంస్కృతిక కళాకారులతో సాంస్కృతిక శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ముచ్చింతల్ సమతా క్షేత్రంలో విరాట్ రూపంలో భగవత్ రామానుజుల ఆవిష్కరణకు సర్వ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మహోత్కృష్టమైన సహస్రకుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ యాగ మహాక్రతువుకు అంకురార్పణ జరబోయేముందు విష్ణుసహస్రనామ పారాయణ జరిపించారు. ఈ పారాయణతో సూర్తి కేంద్రమంతా నారాయణ నామస్మరణతో మారుమోగింది. శ్రీ లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణలో భాగంగా ముందు గా విష్వక్సేన ఆరాధన, తర్వాత పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్ సంగ్రహణం అంటే మట్టిని సేకరించడం లాంటి అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు.

మంగళవాయిద్యాలు, రామానుజ నినాదాలతో

భగవత్ రామానుజల నినాదాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి యాత్ర అత్యంత వైభవోపేతంగా 3 కిలో మీటర్ల మేర సాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రుత్వికులు, అర్చకస్వాములు ఈ యాత్రలో ముందుండి నడిపించారు. కోలాటాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో శ్రీమన్నారాయణ నామసంకీర్తనలతో ఈ శోభాయాత్ర పవిత్ర యాగశాలలోకి చేరింది. యాగశాలలో తొలుత పెరుమాళ్ల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఐదుగురు జీయర్ స్వాములు అనుగ్రహభాషణం చేశారు. 1035 హోమ గుండాలలో నిర్వహించే కార్యక్రమాలను భక్తులకు వివరించారు. ప్రథమంగా విశ్వక్సేన పూజతో ప్రారంభించి వాస్తు ప్రాంగణ శుద్ధి, పుణ్యహవచనం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వాస్తుహో మం, పూర్ణాహుతి కార్యక్రమాలు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా జరిగాయి. యాగశాలకు వచ్చిన భక్తులకు వాస్తుశాంతి పూజ ప్రాధాన్యతను అందులోని విశిష్టతను చిన్న జీయర్ స్వామి వివరించారు. 144 యాగశాలల్లో జరిగే 1035 హోమ గుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు గురించి వివరించారు. ప్రతి రోజు సాయంత్రం విష్టు సహస్రనామ పారాయణం ఉంటుందని, ఆ తరువాత ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ 12 రోజుల మహాక్రతువులో ప్రధానమైన యాగశాలలో 1035 కుండాలలో మహాయజ్ఞం జరుగతుంది.

వేదపారాయణ వేడుకలకు అంకురార్పణ :

యాగశాలలో బుధవారం నాడు సాయంత్ర వేదపారాయణ మధ్య సహస్రాబ్దీ వేడుకలకు అంకురార్పణ చేశారు. ప్రధాన యాగశాలలో రుత్విక్వరణం, యజమానులకు కంకణధారణ జరిగింది. అనంతరం దీక్షలు స్వీకరించి యాగదీక్ష స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, చిన్న జీయర్ స్వా మివారి శిష్యబృందం ఆధ్వర్యంలో జీవ ప్రాంగణం నుంచి పవిత్ర యాగశాల వరకు సాంస్కృతిక శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది.ఈక్రమంలో యాగశాలలో అరణి మథ నం, అగ్ని ప్రతిష్ఠ, సుదర్శనేష్టి, వాసుదేవనేష్టి, పెద్ద జీయర్ స్వామి వారి పూజ విశేషంగా నిర్వహించనున్నారు.
ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ :
ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల నేపథ్యంలో తపాలా శాఖ ప్రత్యేకంగా పోస్టల్ కవర్‌ను రూపొందించింది. ఈ మేరకు తపాలా శాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను చినజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం సమతా మూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2,500 మంది కళాకారులు ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు.మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరిగింది. చినజీయర్ స్వామి యాగశాలలో జరిగిన ఈ వేడుకల అంకురార్పణ కార్యక్రమానికి మై హోం ఎండి జూపల్లి జగపతిరావు, ఢిల్లీలోని తెలంగాణ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు హాజరయ్యారు. అంతకుముందు రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా యాగశాలలో వాస్తు శాంతి పూజను వేదపండితులు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజల సహస్రాబ్ది ఉత్సవాలకు వెళ్లే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 14 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

7,500పోలీసుల,12వేలమంది వాలింటర్లతో భద్రత :

శ్రీరామానుజల సహస్రాబ్ది ఉత్సవాల భద్రతకు 7,500 పోలీసులతో 12 వేల మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నా రు. ఈ వేడుకల్లో సేవలందించేందుకు వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12 వేల మంది వాలంటీర్లు వివిధ దశల్లో భక్తులకు సేవలందిస్తున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాలతోపాటు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 20 జిల్లాలు సహా మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News