Friday, December 20, 2024

కమనీయం.. ‘రాములోరి కల్యాణం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాచలం: నీలిమేఘ శ్యాముడు.. రఘుకుల సోము డు.. శ్రీరామచంద్రుడు.. కల్యాణ రామునిగా మారి.. సౌందర్య రాశి.. సుగుణాల తల్లి సీతమ్మను పరిణయమాడాడు. నునుసిగ్గుల మొలకైన సీతమ్మకు నుదుటన కల్యాణ బొట్టు, బుగ్గన కాటుక పెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలను అలంకరింపజేశారు. దీంతో అందాలరాశి సీతమ్మ  మరింత అందంగా కనిపించింది. ఆమెకు ఏమాత్రం తీసిపోని విధంగా రఘువంశతిలకుడు…దశరధరాజు తనయుడు శ్రీరామచంద్రుడు సర్వాభరణ భూషితుడై కల్యాణ వేదిక మిథిలాపురికి తన పరివారంతో చేరుకున్నాడు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, రామమాడ వంటి ఆభరాణలను వధూవరులకు అలంకరించడంతో మరింత అందానిచ్చాయి. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ.. ఆలయ అర్చకులు నయనానందకరంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కల్యాణాన్ని ఆదివారం నిర్వహించారు.

మండే ఎండలను సైతం లెక్క చేయకుండా భద్రాద్రి చేరుకున్న భక్తులకు ఆ శ్రీరామచంద్రమూర్తి తన చలువ పందిళ్లలో చోటిచ్చి… సీతమ్మను పరిణయమాడాడు. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా.. వేదమంత్రాల మధ్య అభిజిత్ లగ్నం ప్రవేశించగానే మిథిలాపురి కల్యాణ మండపంలోని రజిత సింహాసనంపై కొలువైన సీతారాముల పై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. మూడు మంగళసూత్రాలతో భక్తరామదాసు చేయించిన పతకాన్ని కలిపి వేదపండితులు మాంగళ్యధారణ చేశారు. సీతారాముల శిరస్సుల నుంచి ముత్యాల తలంబ్రాలు జల్లులా.. పడుతుంటే భక్తులంతా ఆ సమయంలో ఒళ్లంతా కళ్లు చేసుకొని చూసారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ కోసం భక్తులంతా వేయికళ్లతో ఎదురు చూస్తూ గడిపారు. ఆణిముత్యాలు తలంబ్రాలుగా సీతారాముల పై పడుతుంటే భక్తులు పులకించిపోయారు.

కల్యాణం జరిగిందిలా

తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీరామననవమి రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో దేవాలయం తలుపులు తెరిచారు. సుప్రభాత సేవ, తిరువారాధన, ఆరగింపు, మంగళ శాననాలు నిర్వహించారు. మూల వరులకు అభిషేకం చేశారు. ఉదయం 8 గంటలకు రామాలయంలో దృవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. కల్యాణ మూర్తులను అలంకరించి దేవాలయం నుంచి పూల పల్లకీలో మంగళవాయిద్యాల మధ్య రామనామ కీర్తనలతో ఊరేగింపుగా శిల్ప కళా శోభితమైన మిథిలాపురంలోని కల్యాణమండపానికి తీసుకొచ్చారు. స్వామి మిథిలాపురికి చేరగానే భక్తులంతా లేచి జై శ్రీరాం అంటూ..నీరాజనాలు పలికారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో పరిణయానికి ఉపయోగించే సకల సామగ్రిని ప్రోక్షణ చేశారు. ఒక దర్భతాడును సీతమ్మ నడుముకు బిగించారు. రామయ్య కుడి చేతికి సీతమ్మ ఎడమ చేతికి రక్షాసూత్రాలు కట్టారు. కన్యాదానం చేసి ఇరు వంశాల గోత్రాలను మూడు సార్లు చదివారు.

ఒక్క సీతారాములకే కాక కల్యాణాన్ని తిలకించడానికి వచ్చే భక్తులందరకీ వర్తించేలా అర్చకులు మంగళాష్టకాలు చదివారు. విశ్వక్సేన పూజ చేసారు, పుణ్యాహావచనం నిర్వహించారు. వరద పూజ అనంతరం స్వామివారికి, అమ్మవారికి భక్తరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం ప్రవేశించగానే సీతారాముల శిరస్సుపై జీలకర్ర బెల్లం పెట్టారు. గౌరీదేవి, సరస్వతి, శ్రీమహాలక్ష్మి అమ్మవార్లను ఆవాహన చేసిన మంగళసూత్రాలతో భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాన్ని కలిపి 12.30 గంటలకు మాంగళ్యధారణ కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు సీతారాముల శిరస్సు పై పోస్తూ వాటి విశిష్టతను వివరించారు. బ్రహ్మముడి వేసి అర్చక స్వాములు పూబంతులాడారు. కర్పూర నీరాజనం సమర్పించి, కల్యాణ క్రతువు పూర్తిచేశారు. దీన్ని వారాయణం అంటారు. దీన్ని తిలకించిన భక్తులకు సద్భుద్ధి కలిగిన సంతానం కలుగుతుందని నమ్మకం. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

కల్యాణాన్ని తిలకించిన ప్రముఖులు

శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా తిలకించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం,హైకోర్టు న్యాయమూర్తి నగేష్, మహబూబబాద్ ఎంపి మాలోత్ కవిత, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌సి తాతా మధు, భద్రాచలం ఎంఎల్‌ఎ వీరయ్య, టిటిడి మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు,జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్‌పి డా.వినీత్ తిలకించారు.

నేడు మహాపట్టాభిషేకం..

రఘువంశ తిలకుడు…శ్రీరామచంద్రునికి నేడు మిథిలాపురిలో నేడు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. 12 ఏళ్ల తర్వాత వస్తున్న పుష్కర పట్టాభిషేకం చాలా విశిష్టత కలిగినదని పండితులు తెలిపారు. భద్రాచలం శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే జరిగే పట్టాభిషేక కార్యక్రమాన్ని మరే దేవాలయంలో కూడా నిర్వహించరని అర్చకులు చెబుతున్నారు. మహాపట్టాషేక కార్యక్రమాన్ని ప్రతీ ఏడాది గవర్నర్ చేతుల మీదుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News