భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం
టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వెల్లడి
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని చైర్మన్ వివరించారు. ఆన్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని, త్వరలోనే ఈ సమస్యను అధిగమించి ఆన్లైన్ లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.