చిక్కడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం 2,600 గజాల్లో ఉండగా ప్రస్తుతం అది 1,100 గజాలకు కుదించుకుపోయింది. మిగతా 1500 గజాల భూమిని కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో పాటు వాటిని అమ్మేసుకున్నారు. అయితే చిక్కడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న 2,600 గజాల భూమి కూడా ‘పైగా’ భూములని ప్రభుత్వం 2014, 15 సంవత్సరంలో నిర్ధారించింది. అయితే ఆలయం ఉన్న ప్రాంతం కాకుండా మిగతా ఖాళీగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలని అప్పటి హిమాయత్‌నగర్ తహసీల్దార్ దేవాదాయ శాఖకు లేఖ రాశారు.
అదే సంవత్సరంలో అప్పటి దేవాదాయ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఆలయం ఉన్న భూమి కాకుండా మిగతా 1,500 గజాల భూమి కబ్జాకు గురయ్యిందని, ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని దేవాదాయ శాఖకు నివేదిక అందించారు. 2014 నుంచి 2024 వరకు 1,500 గజాల భూమిని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోకుండా నివేదిక ఇచ్చిన అధికారే అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు కబ్జాదారులకు మేలు చేస్తున్నారని స్థానికులు ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.