- Advertisement -
భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు. పార్టీలు తనపై పోటీకి అభ్యర్థులను నిలబెట్టకూడదని కోరారు. బిఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరానని ఆమె తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు పదేళ్లయినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వెయ్యిమంది అమరులయ్యారని, వారిలో తన కొడుకు కూడా ఒకరని శంకరమ్మ చెప్పారు. వారి కుటుంబాలకు ఎలాంటి పదవులు లభించలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయనివారు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారని విమర్శించారు.
- Advertisement -