కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరో ఏడాదిపాటు ఉండగలదని అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే తెలిపారు. ‘లెటజ్ రీసెట్ శ్రీలంక’ అనే రెండు రోజుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. దేశంలో సంస్కరణలు మరింత పన్ను పెంచే విధానంగా ఉండాలన్నారు. వచ్చే ఏడాది జూలై వరకు ప్రజలకు తిప్పలు తప్పవన్నారు. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆర్థిక విధానం చూసినట్లయితే లాజిస్టిక్స్, న్యూక్లియర్ పవర్ దేశానికి ఎంతో అవసరమని గ్రహించొచ్చు అన్నారు. శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చిన 1948 నుంచి ఆర్థిక సంక్షోభం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు. శ్రీలంకకు పర్యాటక రంగమే ముఖ్యమైన దన్ను అన్నారు. శ్రీలంక ఆర్థికంగా దివాళా తీసిందని, తిరిగి కోలుకోవాలంటే అత్యధిక పన్ను విధానం తప్పనిసరి అని ఆయన చెప్పారు. మాక్రో ఎకనామీ పుంజుకునే వరకు శ్రీలంకకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రపంచ బ్యాంకు కూడా వెనుకాడుతోందన్నారు. శ్రీలంకలోని 21 మిలియన్ ప్రజలలో 6 మిలియన్ ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అదనంగా వచ్చే నిధులను వారి కోసం ఖర్చు పెడతామన్నారు.