Thursday, January 23, 2025

శ్రీలంకలో అదానీమోడీయం `

- Advertisement -
- Advertisement -

Special article about quad summit in tokyo ప్రధాని మోడీకి, గుజరాత్ పారిశ్రామిక వాణిజ్య సామ్రాట్టు గౌతమ్ అదానీకి గల అసాధారణ మైత్రి గురించి తెలియనివారు ఉండరు. ఈ బంధం అన్ని ప్రభుత్వ నియమాలనూ దాటిపోయి ఇప్పుడు ఆర్ధికంగా దివాలా తీసి భిక్షా పాత్ర పట్టుకొన్న శ్రీలంకకు కూడా పాకడం విశేషం. అక్కడ అదానీ వ్యాపార విస్తరణకు దొడ్డిదారిని తెరిపించడానికి మోడీ ప్రధానిగా తనకున్న సర్వశక్తులనూ వినియోగించారన్నది తాజా సమాచారం. ఆయన వొత్తిడికి లొంగి ఉత్తర మన్నార్ జిల్లాలోని 500 మెగావాట్ల సౌర, వాయు విద్యుత్ కర్మాగారాన్ని శ్రీలంక ప్రభుత్వం అదానీకి కట్టబెట్టిందని వెల్లడైంది.

ఈ కర్మాగారం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును అధిక రేట్లకు అమ్ముకునే వెసులుబాటును కూడా అదానీకి కల్పించారని తెలుస్తున్నది. ఆ మేరకు తనను దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్ష ఆదేశించినట్టు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఎంఎంసి ఫెర్డినాండో శ్రీలంక పార్లమెంటరీ కమిటీ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం అక్కడ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నది. తాను ఉద్వేగంలో పార్లమెంటరీ కమిటీ ముందు ఆ ప్రకటన చేశానని చెప్పి ఫెర్నాండో ఆ తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకొన్నప్పటికీ శ్రీలంక ప్రతిపక్షం సంతృప్తి పడలేదు. భారత ప్రధాని మోడీ మిత్రులకు దొడ్డి దారి ప్రవేశం కల్పిస్తూ వారిని రాజపక్ష ప్రభుత్వం బుజ్జగిస్తున్నదని అక్కడి ప్రతిపక్షం విరుచుకుపడింది. దీనితో ఫెర్నాండో పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. అధ్యక్షుడు రాజపక్ష నవంబరు 24 న తనను పిలిచి భారత ప్రధాని మోడీ తనపై తీవ్రమయిన ఒత్తిడి తెస్తున్నారని, ఆ పవర్ ప్రాజెక్టును అదానీకి కేటాయించాలని చెప్పినట్టు ఫెర్నాండో కమిటీ ఎదుట వివరించారు.

దీనిని ఆధారం లేని ఆరోపణగా తీసి పారేయలేము. అత్యున్నత స్థాయి దర్యాప్తు వ్యవస్థ పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడించిన సమాచారం నిగ్గును యెంత మాత్రం అనుమానించలేము. తాను చెప్పినట్టు ప్రాజెక్టును అదానీకి యిచ్చినట్టే యిచ్చి కావాలని బయటకు పొక్కించారనే విమర్శ భారత ప్రధాని నుంచి వస్తుందని భావించి ఫెర్నాండో చేత రాజీనామా చేయించి వుంటారు. అదానీకి మేలు చేయడానికి ఇంధన ప్రాజెక్టుల కేటాయింపును వేలం పద్ధతి నుంచి మినహాయిస్తూ శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయవలసి వచ్చిందంటే రాజపక్షపై ప్రధాని మోడీ యెంత వొత్తిడి కలిగించి వుంటారో అర్ధం చేసుకోవచ్చు. మోడీకి అదానీకి గల మైత్రి యెంత లోతయినదో తెలిసిందే. వారి బంధం ఇప్పటిది కాదు, యెప్పటి నుంచో పెనవేసుకొంటూ వస్తున్నది. 2000 వ దశకం తొలి సంవత్సరాల్లో అహ్మదాబాద్ అల్లర్లలో ముస్లింలపై సాగిన అత్యంత అమానుషమైన హింసాత్మక దాడులను ముఖ్యమంత్రిగా అడ్డుకోనందుకు మోడీని అందరూ నిరసించినప్పుడు ఆయన వైపు అదానీ ఒక్కరే గట్టిగా నిలబడ్డారని, అప్పటి నుంచి వారి మధ్య దృఢ బంధం పెనవేసుకున్నదని చెప్పుకొంటారు.

మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారానికి అదానీ విమానంలోనే గుజరాత్ నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ఆస్తి 230 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లు దాటిపోయింది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించే కార్యక్రమంలో అదానీకి అగ్రతర ప్రాధాన్యం లభిస్తుండడమే యిందుకు కారణం. 2018లో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించడానికి నిర్ణయించినప్పుడు, ఆ రంగంలో బొత్తిగా అనుభవం లేనివారు కూడా వేలంలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు. అది కేవలం అదానీ కోసం చేసిన మార్పే. దాని ఆసరాతో ఆ మొత్తం ఆరు విమానాశ్రయాలనూ అదానీకి గంపగుత్తగా కట్టబెట్టారు.

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 50 ఏళ్ల పాటు అదానీకి అప్పగించారు. కేంద్రం అనుసరిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇంతకు మించిన నిదర్శనం అక్కర లేదని అప్పుడు కేరళ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఆస్ట్రేలియాలో అదానీ తలపెట్టిన భారీ బొగ్గు గని ప్రాజెక్టును ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థంబర్గ్ తీవ్రంగా వ్యతిరేకించిన మాట తెలిసిందే. పర్యావరణాన్ని భారీగా దెబ్బ తీయడానికి దాపురించిన దుష్ట శక్తిగా అదానీని పేర్కొంటూ థంబర్గ్ పెట్టిన ‘స్టాప్ అదానీ’ పోస్టుకు 70 వేల లైక్‌లు వచ్చాయి. తాజాగా దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ అత్యధిక వ్యయంతో విధిగా విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు విదేశాల్లోని అదానీ గనులను పోషించడానికి ఉద్దేశించినవేనన్న విమర్శ తెలిసిందే. జనాభాలో సగానికి పైగా పేదలున్న దేశ ప్రధానిగా ఉంటూ నరేంద్ర మోడీ తన మిత్రుడికి దేశాన్ని దోచి పెడుతున్న తీరు తీవ్రంగా ఖండించదగినది. ప్రజా చైతన్యం వొక్కటే ఈ దుస్థితి నుంచి మనలను రక్షించగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News