Monday, December 23, 2024

శ్రీలంక జనాగ్రహం

- Advertisement -
- Advertisement -

Corona again in india తలుపు వేసి కొడితే పిల్లి యెలా తిరగబడుతుందో, బాగా యెండిన గడ్డికి నిప్పు రవ్వ తగిలితే యే విధంగా భగ్గుమంటుందో, ఆకలితో మలమల మాడుతున్న పులి యే తరహాలో ఘాండ్రించి లంఘిస్తుందో శ్రీలంక ప్రజలు ఆ విధంగా తిరగబడ్డారు. చేతగాక చేతులెత్తేసిన ప్రభుత్వంపై సింహాలై ఉరికారు. చిచ్చరపిడుగులయ్యా రు. దేశాధ్యక్షుడి భవనంపై వేలాదిగా దండెత్తారు. అధ్యక్షుడు గోటాబయ రాజపక్స తోక ముడిచి సురక్షిత స్థలానికి పరారయ్యేలా చేశారు. పెట్రోలు, ఆహారం, మందులు తదితర అత్యవసర సామగ్రి ధరలు ఆకాశాన్నంటి రోజులు గడవడం కష్టతరమైన ప్రజలు దేశమంతటి నుంచి కొలంబో చేరుకొని యీ దాడిలో పాల్గొన్నారు. దుబాయ్ వంటి విదేశాల నుంచీ సింహాళీయులు తరలి వచ్చి యీ ఘట్టంలో పాలు పంచుకొన్నారని వార్తలు చెబుతున్నాయి.

విదేశీ అప్పు 50 బిలియన్ డాలర్లు దాటిపోయింది. ఒక్క చైనాకు యివ్వాల్సిందే 6 బిలియన్ డాలర్లు. ప్రజలు తమంతట వీధుల్లోకి వచ్చిన యీ నిరసనల్లో దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స అవినీతి బాహాటంగా ప్రస్తావనకు వచ్చింది. విదేశీ ఖాతాల్లో దాచుకొన్న కోట్లాది డాలర్ల అవినీతి సొమ్ము తెచ్చి నిత్యావసరాలను అందించండని కోరుతూ నిరసనకారులు ప్ల కార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు గోటాబయను GRగా, ఆయన సోదరుడు మహీందను MRగా మరో సోదరుడు బాసిల్ రాజపక్సను BRగా సంబోధిస్తూ ప్ల కార్డులు వెలిశాయి. ముందు చూపు లేని ప్రభుత్వ చర్యల వల్ల డాలర్ నిల్వలు అడుగంటిపోయి దిగుమతులకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి దాపురించింది. ద్రవ్యోల్బణం జూన్ నెలలో 54.6 శాతానికి చేరుకొన్నది. నిరసన శిబిరాలు ఆగ్రహంతో ఊగిపోతున్న సంగతి గమనించిన అధికారులు ముందు రోజు శుక్రవారం నాడే గోటాబయను నివాస భవనం నుంచి సురక్షిత స్థలానికి చేర్చారని తెలుస్తున్నది.

తమ బాధలన్నింటికీ అధ్యక్షుడే కారణమన్న అభిప్రాయంతో నిరసనకారులు ‘గోటా గో హోమ్’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని విక్రమ్ సింఘే ప్రైవేటు భవనాన్నీ తగలబెట్టారు. ఈ దెబ్బతో అధ్యక్షుడు, ప్రధాని కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. అఖిల పక్ష ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తామన్నారు. అరబ్ స్ప్రింగ్ పద్ధతిలో చోటు చేసుకొంటున్న శ్రీలంక ప్రజాగ్రహ ప్రదర్శనలకు భయపడి గత మే 9న ప్రధాని పదవికి అధ్యక్షుని సోదరుడు మహీంద రాజపక్స రాజీనామా చేశారు. దానితో గతంలో అయిదు సార్లు ప్రధానిగా చేసిన విక్రమ సింఘేను కొత్త ప్రధానిగా అధ్యక్షుడు నియమించారు. ఇప్పుడు యిద్దరూ దిగిపోతామని ప్రకటించడంతో మంత్రులంతా రాజీనామా చేశారని వార్తలు చెబుతున్నాయి.

పర్యవసానంగా అఖిలపక్ష ప్రభుత్వం యేర్పాటు కోసం సంప్రదింపులు సాగుతున్నాయని తెలుస్తున్నది. ఈ ప్రజోద్యమం వెనుక దేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థుల సంఘటిత హస్తమున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా తదుపరి ప్రభుత్వాన్ని యేర్పాటు చేసి సంక్షోభ పరిష్కార కృషిని చేపట్టకపోతే ప్రజాగ్రహం మరింతగా రగిలి అనూహ్య పరిణామలకు దారి తీయవచ్చు. ఈసారి నిరసనకారులపై కిరాయి మూకలను గాని, ప్రభుత్వ దళాలను గాని ప్రయోగించకపోవడం మెరుగైన పరిణామం. మే 9 నాటి ఘటనల్లో ప్రదర్శకులపై అప్పటి ప్రధాని వర్గీయులు బలప్రదర్శన చేయడంతో హింస చెలరేగి వొక ఎంపి సహా అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయినప్పుడు ప్రధాని గాని, పార్లయిమెంటు స్పీకర్ గాని దానిని చేపట్టడానికి అర్హులవుతారు. ప్రధాని సయితం దిగిపోతున్నారు కాబట్టి స్పీకర్ మహీంద యాపా అబేయ వర్ధనకే ఆ అవకాశం వుంది. తాత్కాలిక అధ్యక్షుడుగానే ఆయన ఉండగలుగుతారు. ఆ తర్వాత నెల రోజుల్లో పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని యెన్నుకొంటుంది. తక్షణమే కొత్త ప్రభుత్వాన్ని యేర్పాటు చేయడంతోపాటు ప్రస్తుత సంక్షోభానికి దారి తీసిన ఆర్ధిక దుస్థితిని తొలగించడం అవసరం. శ్రీలంక ఆర్ధిక సంక్షోభానికి పలు కారణాలున్నాయి.

కొవిడ్ మూలంగా దాని కీలక ఆదాయ వనరు పర్యాటకం తీవ్రంగా దెబ్బతిన్నది. దేశమంతా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల ఆహారోత్పత్తి పడిపోయింది. ఓట్లను ఆకట్టుకోడం కోసం పన్నులు తగ్గిస్తామని వాగ్దానం చేసి వాటిని సగానికి సగం కుదించేశారు. విలువ ఆధారిత పన్నును 15 శాతం నుంచి 8 శాతానికి తగ్గించి వేశారు. దీనితో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. విదేశీ మారక ద్రవ్య ఆదాయం దెబ్బ తినిపోయి దిగుమతులకు ఆస్కారం లేకుండా పోయింది. విదేశీ రుణాలు తీర్చలేని దుస్థితి దాపురించి కొన్ని రుణాల వాయిదాలు చెల్లించడం మానుకొన్నది. భారత దేశం ఒకటికి రెండు సార్లు ఆదుకొన్నది. అయినా గట్టెక్కడం సాధ్యం కాలేదు. గత మే నెల ప్రజా తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. చర్చలు విఫలమయ్యాయి. దాని షరతులకు అంగీకరించడం సులభసాధ్యం కాదు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News