హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతోంది. పెరుగుతున్న విద్యుత్తు బిల్లులు నిరుపేదలకు భారంగా మారడం, సరఫరాలో అంతరాయంతో మరింత అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీ నిధి, రెడ్కో సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం పదివేల యూనిట్లు లక్షంగా స్త్రీ నిధి రుణాలు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28లోగా లబ్ధిదారులను గుర్తించి, వారికి రుణ సౌకర్యం కల్పించేలా సెర్ఫ్ అధికారులు కార్యచరణ చేపట్టారు.
సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్తు ఇబ్బందులు ఉండవంటూ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లపై వారు తమకు అవసరమైన సామర్థ్యం మేరకు సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్తు వినియోగించుకునే అవకాశముంది. ఇందుకు స్త్రీనిధి ద్వారా రుణంతో పాటు రాయితీ కల్పిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకుని -విద్యుత్తును వినియోగంలోకి తీసుకుని రాగా, మరిన్ని లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టిఎస్ రెడ్కో) సహకారంతో గ్రామాల్లో మహిళా సభ్యులకు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.
సౌర ఫలకాలు ఏర్పాటు చేసేందుకు 200 చదరపు అడుగుల డాబా ఉండాలి. నెలవారీ గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్తు యూనిట్ల ఆధారంగా 2.కెవి, 3 కెవి యూనిట్ సౌర విద్యుత్తు యూనిట్ నిర్ధారించుకొని అనుమతితో ఏర్పాటు చేయనున్నారు. యూనిట్ ఏర్పాటుకు చేసిన వ్యయం ఐదేళ్ల తిరిగి రాబట్టుకునే వీలుందని అధికారులు వెల్లడించారు. సౌర ఫలకాలకు 25 ఏళ్ల పాటు వారెంటీ కల్పిస్తారని అధికారులు తెలిపారు.
ఆసక్తి కలిగిన మహిళా సభ్యులకు రుణాలు..
ఆసక్తి కలిగిన మహిళా సభ్యులకు ప్రత్యేకంగా స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తుండగా, రాయితీ కూడా కల్పిస్తున్నారు. ఆసక్తి కలిగిన మహిళా సభ్యురాలికి 2 లేదా 3 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు పలకలను రాయితీపై మంజూరు చేసి ఇంటిపై ఏర్పాటు చేస్తున్నారు. 2 కిలోవాట్స్ సామర్థం కలిగిన విద్యుత్తు యూనిట్ ద్వారా రోజు 8 యూనిట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. 3 కిలోవాట్స్ కలిగిన సౌర విద్యుత్తు యూనిట్ ఏర్పాటు 12 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రతి నెల వారు వినియోగించుకునే విద్యుత్ పోను.. అవసరానికంటే ఎక్కువ ఉత్పత్తి అయితే దానికి గ్రిడ్‌కు అనుసంధానించనున్నారు.
మహిళా సభ్యులను ప్రోత్సహించేందుకు డిఆర్‌డిఎ ద్వారా మెప్మా, సెర్ప్ సిబ్బంది. సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సభ్యులు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని విద్యుత్తు ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చునని వారిలో చైతన్యం నింపుతున్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ రెడ్కో tsredco.telangana.gov.in se@tsredco.telangana.gov.inలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
* యూనిట్ ఏర్పాటు వ్యయం, రాయితీ ఇలా…
* సామర్థం ధర రూ రాయితీ(రూ.) స్త్రీనిధి రుణం వాటా ధనం ప్రతినెల చెల్లించాల్సినది
2 కిలోవాట్స్ 142,000 39,200 లక్ష 3 వేలు 2243
3 కిలోవాట్స్ 1,92,360 57.360 1,25000 పది వేలు 2803