Monday, December 23, 2024

పూర్తి పారదర్శకతతో మద్యం దుకాణాల టెండర్లు..

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిండికేట్లుగా ఏర్పడి మద్యం దుకాణాలను నిర్వహించేవారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్మును కొల్లగొట్టి కొందరి జేబులు నింపుకునేవారని, నకిలీ మద్యం ఏరులై పారేదని మంత్రి అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మద్యం వచ్చేదని, ఇప్పుడు అలా కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్తి పారదర్శకంగా తెలంగాణలో మద్యం దుకాణాలకు టెండర్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో లాటరీ ద్వారా మద్యం టెండర్ల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు.

అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉండగా, 22 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయని వాటిని పక్కన పెట్టి సోమవారం 2598 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా పూర్తి పారదర్శకతతో టెండర్లను నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 1,31,270 దరఖాస్తులు వచ్చాయని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది, అనుమానం లేకుండా వీడియోగ్రఫీ చేయించడం, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారా అందరికీ తెలిసే విధంగా లాటరీ నిర్వహించడం చేస్తున్నామని, అంతేకాక దుకాణాలు పొందినవారికి అప్పటికప్పుడే ఉత్తర్వులు సైతం అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

గతంలో ఇలాంటి పారదర్శకత ఉండేది కాదని, నకిలీ మద్యం అమ్మేవారని, కల్తీ మద్యం ఏరులై పారేదని అన్నారు. చాలా తండాలలో కల్తీ మద్యం తాగి చనిపోయిన సంఘటనలు మనకు కనిపించేవని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్సైజ్, పోలీసులు సమర్థవంతంగా పనిచేసినందువల్ల నకిలీ మద్యాన్ని అరికట్టగలిగామన్నారు. సిండికేట్లకు తావు లేకుండా మద్యం దుకాణాలతో టెండర్లను నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు స్వచ్ఛమైన నీరా ఇవ్వాలన్న ఉద్దేశంతో నీరా పాలసిని తీసుకొచ్చామని, దాని ద్వారా ఆరోగ్యకరమైన పానీయాన్ని అందించగలుగుతున్నామన్నారు. ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కోట్ల 30 లక్షల తాటి, ఈత చెట్లను పెంచుతున్నామని తెలిపారు.

గౌడ కులవృత్తి అయిన మద్యం అమ్మకంలో భాగంగా పురాణాలలో సైతం గౌడలు 18 రకాల మద్యాన్ని అమ్మినట్లు మనకు చెబుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలలో గౌడలకు 15% రిజర్వేషన్ కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీగా మద్యం దుకాణాల టెండర్లను చేపట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News