మహబూబ్ నగర్: ప్రభుత్వ ఉద్యోగులు మహబూబ్ నగర్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, సాధించిన అభివృద్ధితో సంతృప్తి పడకుండా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని టిఎన్జీవో భవన్ వద్ద ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఉద్యోగుల పట్ల ప్రేమతో సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఇటీవలే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి సర్వీసులోకి తీసుకోవడంతో పాటు మెప్మా ఉద్యోగుల జీతాలను పెంచేందుకు అంగీకరించిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యోగులపై ఉందని, తెలంగాణతో పాటు మహబూబ్ నగర్ జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. జిల్లాలో త్వరలోనే మూడు వందల కోట్ల రూపాయలతో పాత కాలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నామని, దీంతో పాటు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ మంత్రిని గజమాలతో సత్కరించారు.కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు రాజగోపాల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, రాష్ట్ర చైర్మన్ ప్రతాప్, టీఎన్జీవో అధ్యక్షులు రాజేందర్రెడ్డి, టిజీవో జిల్లా కార్యదర్శి బక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Srinivas Goud birthday celebrations in MBNR