మహబూబ్ నగర్: హైదరాబాద్ తరహాలో జిల్లా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మంత్రి జిల్లాలోని ఆర్అండ్ బి అతిథి గృహం వద్ద 81 లక్షల 51 వేల రూపాయల వ్యయంతో మున్సిపాలిటీకి కేటాయించిన రోడ్డును పరిశుభ్రం చేసే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ లోనే ఉన్న రహదారి శుభ్రం చేసే వాహనాన్ని మహబూబ్ నగర్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రహదారుల విస్తరణ, కూడళ్ళ అభివృద్ధి, రోడ్డు డివైడర్ మధ్యలో 15 సంవత్సరాల వయసు కలిగిన మొక్కల ఏర్పాటు, డ్రైనేజీల నిర్మాణం, ట్యాంక్ బండ్ సుందరీకరణ, శిల్పారామం వంటి ఎన్నో పనులను చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ కు దీటుగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కాగా మున్సిపాలిటీకి నూతనంగా మంజూరుబుచేసిన రోడ్డు ను శుభ్రం చేసి వాహనంతో గంటకు 5 నుండి 7 కిలోమీటర్ల మేర రహదారిని శుభ్రం చేయవచ్చు. ఈ వాహనంలో దుమ్ము సేకరించేందుకు 6000 లీటర్ల సామర్థ్యం ఉన్న యంత్రాన్ని, అదేవిధంగా రోడ్డుపై ఉన్న మట్టిని నీటి ద్వారా శుభ్రం చేసేందుకు 1800 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ స్ప్రేయర్ ను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా పట్టణంలోని రహదారులను ఎప్పటికప్పుడు చెత్త లేకుండా లేకుండా శుభ్రం చేసేందుకు ఆస్కారం ఉంది.అంతే కాక ఈ ప్రత్యేక వాహనం వల్ల పారిశుధ్య పని వారికి పనిభారం తగ్గుతుంది.
ఈ సందర్భంగా మంత్రి ఇక్కడే 49 స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు కోటి 4 లక్షల రూపాయల విలువ చేసే బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింలు, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్ పిఆర్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.
Srinivas Goud flags off Vehicle for Road Cleaning