మహబూబ్ నగర్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల కారణంగా ప్రజల జీవన శైలిలో మార్పులు వచ్చాయని, ప్రతి గడపకు ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి జిల్లాలోని అడ్డాకుల మండలం, కందూరు గ్రామ శివారు గ్రామమైన వడ్డేపల్లిలో కోటి 81 లక్షల 44 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 36 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో వడ్డేపల్లి గ్రామంలో వడ్డేరులు రాళ్లు కొట్టుకొని జీవనం సాగించే వారని, పడిపోయిన ఇళ్ళలో ఉంటూ కాలం వెళ్లదీసే వారని.. అలాంటిది తమ ప్రభుత్వం 36 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు, అన్ని కులాల వారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అభిమతమని, ఇందులో భాగంగానే నిరుపేదల అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాక పూర్వం ప్రజలు సాగు నీటితోపాటు, తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ఎండాకాలంలో కూడా బోర్లు, చెరువులలో పుష్కలంగా నీరుందని, పాడిపంటలతో రైతులు, యాదవులు, మత్స్యకారులు, అన్ని కులాల వారు తమ వృత్తులతో సంతోషంగా జీవితం గడుపుతున్నారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవనశైలిలో ఎంతో మార్పు వచ్చిందని, ముఖ్యంగా పాలమూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అందరి సహకారంతో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పాలమూరు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, ప్రత్యేకించి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతామని మంత్రి తెలిపారు.
Srinivas Goud inaugurates Double houses in Vaddepalli