Wednesday, January 29, 2025

రైతుబంధు సంబరాలతో తెలంగాణలో ముందే సంక్రాంతి: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: గడచిన 15రోజుల నుండి తెలంగాణలో రైతు బంధు సంబరాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ గ్రామీణ మండలం కోడూరు నుండి మన్యం కొండ స్టేజ్ వరకు రైతుబంధు సంబరాల సందర్భంగా నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం కోడూరు రైతు వేదికలో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు నీతి తప్పడని, అలాంటి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గతంలో రైతులు సాగునీటికి, విద్యుత్ కు, విత్తనాలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్ తో పాటు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు బీమా, ఇచ్చి రైతును రాజును చేయాలన్న కలలను నెరవేరుస్తున్నారని ఆన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలు చేస్తున్నామని, పేదల ఆర్థిక పరిస్థితులు మారిపోయాయని, గ్రామాలు కళకళలాడుతున్నాయని, 2014కు ముందు మహబూబ్ నగర్ జిల్లా తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నదని, ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత కరెంటు ఇస్తున్నామని, ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రైతు ప్రజలను ప్రభావితం చేసే స్థాయికి రైతు వచ్చాడని తెలిపారు.ప్రభుత్వం ప్రజల కోసం, రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలను రైతుబంధు ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, పిఏసిఎస్ ప్రతినిధులు గ్రామ గ్రామాన తెలియజేయాలని అన్నారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ ను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దుతామని, ఎన్ని శక్తులు అడ్డొచ్చిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రైతు బంధు పథకం కింద ఒక్క మహబూబ్ నగర్ నియోజకవర్గానికే 200 కోట్ల రూపాయలను, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1460 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం మంత్రి రైతుబంధు సంబరాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు.

Srinivas Goud participate in Rythu Bandhu Rally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News