కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ ను తెలంగాణ గవర్నర్ తిరస్కరించారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్… ఎలాంటి సామాజిక సేవ చేయలేదంటూ… వీరు రాజకీయ నాయకులని పేర్కొంటూ గవర్నర్ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. తమిళనాడు బిజెపి అధ్యక్షురాలైన తమిళ్ సై… రాజకీయాల నుంచి నేరుగా గవర్నర్ కాలేదా అని అన్నారు. బిజెపికి ఓ న్యాయం బీఆర్ఎస్ పార్టీకి మరో న్యాయమా అని ఆయన నిలదీశారు. గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విఘాతం అని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన వారిని అణచివేసే కుట్ర ఇదని పేర్కొన్నారు. ప్రధాని బీసీ అయినా బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలను అణచివేసేందుకు బిజెపి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నదన్నారు. బిజెపిలో ఉండి రాజకీయం చేస్తే మాత్రమే పవిత్రమా? ఇతర పార్టీల వారు రాజకీయాలు చేస్తే అపవిత్రం అయిపోతుందా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కక్షపూరితంగా తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల వారిని ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారని అందుకే ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణ, ఎంబీసీ అయిన దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ కు చెప్పి నిలుపుదల చేయించారని విమర్శించారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం దేశంలో 58 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని, త్వరలో తెలంగాణ వస్తున్న ప్రధాని మోడీకి చెప్పి బీసీ బిల్లును ఆమోదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.