Friday, November 15, 2024

సురవరం ప్రతాప్‌రెడ్డి సేవలు భావి తరాలకు ఆదర్శం : శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Srinivas Goud tribute Suravaram Pratapa Reddy on his birthday

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వైతాళికులు, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాప్ రెడ్డి సేవలు అమోఘమని, భావి తరాలకు ఆదర్శమని క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతాప్ రెడ్డి 126వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి ఈరోజు ఉదయం పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహుభాషా కోవిదుడుగా, పరిశోధకుడుగా, చరిత్ర కారుడిగా, పండితుడుగా, నాటకకర్తగా, కవిగా, విమర్శకుడుగా నవలా రచయితగా, పత్రిక సంపాదకునిగా, విభిన్న వ్యవస్థల ప్రతినిధిగా నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహానీయుడు కొనియాడారు.

తెలంగాణలో కూడా కవులున్నారా అని ప్రశ్నించిన వారికి ప్రతాప్‌రెడ్డి సవాలుగా తీసుకొని 354 మంది తెలంగాణ కవుల కవితలను కూర్చి గోల్కొండ కవులు ప్రత్యేక సంచికగా ప్రచురించి సమాధానం చెప్పారని గుర్తు చేశారు. నిజాం నిరుంకుశపాలనలో తెలుగువారి అణిచివేతను వ్యతిరేకిస్తూ తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి సురవరం ఎనలేని కృసి చేశారన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను మరింత చైతన్యవంతం చేయవచ్చని భావించి గ్రంథాలయోద్యమానికి శ్రీకారం చుట్టిన మార్గదర్శి అని అన్నారు. ఆంధృల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం, ఇతర ముఖ్యమైన సురవరం రచనలను పాఠ్యాంశంలో చేర్చి నేటి తరానికి అందిస్తున్నామన్నారు. ఆ మహానీయుడి ఆశయాలకు పునరంకితం కావడమే ఆయనకు అందించే ఘననివాళి అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రతాప్ రెడ్డి అందించిన స్పూర్తి భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

ప్రతాప్ రెడ్డి జయంతిని అధికారికంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని సామాజిక వేత్తలకు, పురస్కారాలను అందిస్తున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సురవరం ప్రతాప్ రెడ్డి జన్మించిన ఇటిక్యాలలో అధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్‌రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ సభ్యులు సురవరం కృష్ణవర్థన్ రెడ్డి, పుష్పలత, కపిల్, అనిల్ రెడ్డి, లక్ష్మికాంత్ రెడ్డి, ఎస్‌వి రెడ్డి తదితరులు సురవరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Srinivas Goud tribute Suravaram Pratapa Reddy on his birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News